కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాను మరో కీలక పదవి వరించింది. జై షా ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షునిగా ఎంపికయ్యాడు. శనివారం ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో సభ్యులంతా 32 ఏళ్ల జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకూ ఆ పదవిలో బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ నజ్ముల్ హసన్ పాపన్ కొనసాగారు.
ఈ సందర్భంగా జై షా మాట్లాడుతూ.. క్రికెట్ ఆడే అన్ని దేశాల మధ్య ఏసీసీ ఆరోగ్యకరమైన పోటీని పెంచుతుంది. ఆసియా ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి మరింత పాటుపడాలి. కరోనా మహమ్మారి కారణంగా క్రిడారంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చాలా బోర్డులు తమ జట్లతో మళ్లీ తమ క్రికెట్ కార్యకలాపాలను ప్రారంభించాయి. మున్ముందు సవాళ్లను ఎదుర్కొంటూ సమర్థవంతంగా పనిచేస్తామని షా అన్నారు. ఈ సందర్భంగా జై షాకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధూమల్ అభినందనలు తెలిపారు.