శార్దూల్‌ ఠాకూర్ మెరుపులు.. బుమ్రా బుల్లెట్‌లు

Jasprit Bumrah Leads India's Fightback.ఓవ‌ల్ పిచ్ పేస్‌కు స‌హ‌క‌రిస్తుండ‌డం.. ఇరు జ‌ట్ల బౌల‌ర్లు విజృంభిండంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 2:17 AM GMT
శార్దూల్‌ ఠాకూర్ మెరుపులు.. బుమ్రా బుల్లెట్‌లు

ఓవ‌ల్ పిచ్ పేస్‌కు స‌హ‌క‌రిస్తుండ‌డం.. ఇరు జ‌ట్ల బౌల‌ర్లు విజృంభిండంతో భార‌త్-ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య ఇక్క‌డ ప్రారంభ‌మైన నాలుగో టెస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. తొలుత టీమ్ఇండియా 191 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా.. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 53/3 తో నిలిచింది. డేవిడ్‌ మలన్‌ (26), ఓవర్టన్‌ (1) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల‌ను ఎంత తొంద‌ర‌గా పెవిలియ‌న్ చేర్చుతారు అన్న‌దానిపైనే భార‌త విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

అవే త‌ప్పులు..

టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. భార‌త బాట్స్‌మెన్ల బ‌ల‌హీన‌త‌ల‌ను ఇంగ్లండ్ బౌల‌ర్లు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే మ‌న బ్యాట్స్‌మెన్లు కూడా వారికి అప్ప‌నంగా వికెట్లు అప్ప‌గించేస్తున్నారు. ఆఫ్ స్టంప్ ఆవ‌ల స్వింగ్ బంతుల‌తో ఇంగ్లీష్ బౌల‌ర్లు ఊరించ‌డం.. మ‌న బ్యాట్స్‌మెన్లు అన‌వ‌స‌రంగా వాటిని ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. స్లిప్‌లోనో, వికెట్ కీప‌ర్ కో క్యాచ్ ఇచ్చి వెనుదిరగ‌డం ఈ సిరీస్‌లో భార‌త బ్యాట్స్ మెన్ల‌కు ప‌రిపాటిగా మారింది. క‌నీసం ఈ టెస్టులో అయినా.. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటారేమోన‌ని అనుకుంటే అలాంటి ప్ర‌య‌త్న‌మే క‌నిపించ‌లేదు.

ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(11), రాహుల్‌(17) బాగానే ఆడుతున్న‌ట్లు క‌నిపించినా.. వోక్స్ వ‌స్తూనే మాయ చేశాడు. రోహిత్‌ను పెవిలియ‌న్ చేర్చాడు. మ‌రో ప‌రుగు కూడా చేయ‌కుండానే రాహుల్ కూడా వెనుదిరిగాడు. ఆదుకుంటాడు అనుకున్న న‌యావాల్ పుజారా(4) కూడా విఫ‌లం అయ్యాయి. దీంతో 33 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. ర‌హానే కంటే ముందు వ‌చ్చిన జ‌డేజా(10) ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. ఈ ద‌శలో జ‌ట్టునే న‌డిపించే బాధ్య‌త‌ను కెప్టెన్ కోహ్లీ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) భుజానా వేసుకున్నాడు. మ‌రోవైపు ర‌హానే(14) త‌న పేల‌వ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. అర్థ‌శ‌త‌కం త‌రువాత కోహ్లీ కూడా నిష్ర్క‌మించ‌డం, పంత్(9) వెంట‌నే పెవిలియ‌న్ చేరాడు. అప్ప‌టికి భార‌త్ స్కోర్ 122/6. ఆ స‌మ‌యంలో క‌నీసం 150 స్కోర్ దాట‌డం చాలా క‌ష్టంగా అనిపించింది.

అందివచ్చిన అవ‌కాశాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రెండు చేతులా ఒడిసిప‌ట్టుకున్నాడు. టీ 20 త‌ర‌హాలో చెల‌రేగిన ఆడాడు. చివ‌రికి వోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ వెంట‌నే మిగిలిన వికెట్లు కోల్పోవ‌డానికి భార‌త్‌కు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ 4, రాబిన్‌సన్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్ కు బుమ్రా గ‌ట్టి షాక్ ఇచ్చాడు. నాలుగో ఓవర్‌ రెండో బంతికి రోరీ బర్న్స్‌ (5)ను ఔట్‌ చేసిన బుమ్రా.. అదే ఓవర్‌ చివరి బంతికి హసీబ్‌ హమీద్‌ (0) పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లండ్‌ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మలన్‌తో కలిసి కెప్టెన్‌ జో రూట్‌ (21) వేగంగా పరుగులు రాబట్టాడు. ఇద్ద‌రూ వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా బంతిని బౌండ‌రీ దాటించారు. చూస్తుండ‌గానే ఇంగ్లండ్ స్కోర్ 150 దాటింది. ఉమేశ్ యాద‌వ్ ఓ చ‌క్క‌ని బంతితో ఈ సిరీస్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్నా రూట్‌ను ఔట్ చేశాడు. ఓవర్టన్ తో క‌లిసి మ‌ల‌న్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించాడు.

Next Story