ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు శుభవార్త
James Anderson unlikely to play the second test against India.రెండో టెస్టుకు ఈ పేసర్ దూరం కానున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2021 11:50 AM ISTతొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. భారత జట్టును ఓడించడంలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి రోజు తొలి సెషన్‌లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చి ఇంగ్లాండ్ విజయానికి బాటలు పరిచాడు. అర్థశతకం చేసి మంచి టచ్‌లో ఉన్న ఓపెనర్ గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ రహానె, పుల్‌ఫామ్‌లో ఉన్న పంత్‌ను ఔట్ చేశాడు. తొలి టెస్టు జరిగిన గ్రౌండ్‌లోనే రెండో టెస్టు కూడా జరగనుండడంతో మరోసారి అండర్సన్ నుంచి భారత బ్యాట్స్‌మెన్లకు ప్రమాదం తప్పదని భారత అభిమానులు బావిస్తుండగా.. వారికి ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు) శుభవార్త చెప్పింది.
రెండో టెస్టుకు ఈ పేసర్ దూరం కానున్నాడు. రొటేషన్ పాలసీలో భాగంగా అండర్సన్‌ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. రొటేషన్ పాలసీలో భాగంగా అండర్సన్ బదులు స్టువర్ట్ బ్రాడ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. దీనిపై ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ మాట్లాడుతూ.. అండర్సన్ ను పక్కనబెట్టడం మాకు ఇష్టం లేదు. తొలి టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే రెండో టెస్టులో బరిలోకి దిగాలని మాకు ఉంటుంది. అయితే.. రొటేషన్ పద్దతిలో బాగంగా ఆటగాళ్ల ఎంపిక ఉండడంతో.. ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. అండర్సన్ స్థానంలో రానున్న బ్రాడ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. రొటేషన్ పద్దతిలో ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల తరువాత మ్యాచ్‌లో వారు ఉత్సాహంగా బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. ఈసీబీ మాత్రం రొటేషన్ పాలసీని ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఆటగాడు ఎంత మంచి ఫామ్‌లో ఉన్నా కూడా అతన్ని పక్కనబెట్టి మరో ఆటగాడికి ఛాన్స్ ఇస్తుంది. బ్యాటింగ్‌లో కూడా బట్లర్ కూడా దూరం అవ్వనున్నాడు. అతడి స్థాయంలో జానీ బెయిర్ స్టో లేదా ఫోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది.