విజ‌యంతో కెరీర్ ముగించిన దిగ్గజ బౌల‌ర్‌.. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

ఇంగ్లాండ్-వెస్టిండీస్ జ‌ట్ల‌ మధ్య 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో జరిగింది

By Medi Samrat  Published on  12 July 2024 5:25 PM IST
విజ‌యంతో కెరీర్ ముగించిన దిగ్గజ బౌల‌ర్‌.. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

ఇంగ్లాండ్-వెస్టిండీస్ జ‌ట్ల‌ మధ్య 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో జరిగింది. ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్‌లో ఇదే చివరి టెస్టు మ్యాచ్. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు అండర్సన్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అంతే కాదు మైదానంలో ఉన్న ప్రేక్షకులు కూడా అండర్సన్‌కు విడ్కోలు ప‌లుకుతూ గౌర‌వ సూచ‌కంగా చప్పట్లు కొట్టారు. ఈ సమయంలో ఆండర్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియో మిమ్మల్ని కూడా భావోద్వేగానికి గురి చేస్తుంది.

జేమ్స్ ఆండర్సన్ మే 2003లో లార్డ్స్‌లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 188 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 350 ఇన్నింగ్స్‌లలో 704 వికెట్లు తీశాడు. 11/71 ఓ టెస్ట్ మ్యాచ్‌లో అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. సగటు 26.46తో, ఎకానమీ 2.79తో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతే కాకుండా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ కూడా నిలిచాడు.

టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..

ముత్తయ్య మురళీధరన్: 800 వికెట్లు

షేన్ వార్న్: 708 వికెట్లు

జేమ్స్ అండర్సన్: 704 వికెట్లు

అనిల్ కుంబ్లే: 619 వికెట్లు

స్టువర్ట్ బ్రాడ్: 604 వికెట్లు

ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 10 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Next Story