అఫ్గానిస్థాన్‌ ఓడిపోతే.. జ‌డేజా చేసే ప‌ని ఏంటంటే..?

Jadeja honest answer to reporter's question.చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఉంది టీమ్ఇండియా ప‌రిస్థితి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 10:27 AM GMT
అఫ్గానిస్థాన్‌ ఓడిపోతే.. జ‌డేజా చేసే ప‌ని ఏంటంటే..?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఉంది టీమ్ఇండియా ప‌రిస్థితి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర ఓట‌ముల అనంత‌రం తేరుకున్న భార‌త జ‌ట్టు ప‌సికూన‌లు అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌ల‌పై ఘ‌న విజ‌యాల‌ను సాధించి సాంకేతికంగా సెమీస్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అయితే.. భార‌త్ సెమీస్ చేరాలంటే..ఇప్పుడు అది అఫ్గానిస్థాన్ జ‌ట్టుపైనే ఆధారప‌డి ఉంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జ‌ట్టు ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాలి. ఇక సోమ‌వారం మ‌రో ప‌సికూన నమీబియాతో జరిగే మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేయాల్సి ఉంటుంది. అలా జ‌రిగిన ప‌క్షంలో నెట్ ర‌న్‌రేట్ ఆధారంగా టీమ్ఇండియా సెమీఫైన‌ల్ చేరుతుంది. ఒక వేళ ఆదివారం అఫ్గానిస్థాన్ ఓడిపోతే.. ఏ స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా నేరుగా కివీస్ జ‌ట్టు సెమీస్ చేరుకుంది. అప్పుడు భార‌త్ ఇంటి ముఖం ప‌ట్టాల్సి ఉంటుంది. గ్రూపు-2 లో ఉన్న పాకిస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి ఇప్ప‌టికే సెమీస్ బెర్తు ఖ‌రారు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.


కాగా.. ఇదే విష‌యాన్ని స్కాట్లాండ్‌తో మ్యాచ్ అనంత‌రం ఓ రిపోర్ట‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను అడిగాడు. 'అఫ్గానిస్థాన్.. కివీస్‌ను ఓడిస్తేనే మ‌న‌కు అవ‌కాశం. ఒక‌వేళ కివీస్ విజ‌యం సాధిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు..?' అని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించాడు. 'అలా జ‌రిగితే ఏం చేస్తాం..? బ్యాగ్ స‌ర్దుకొని ఇంటికి వ‌స్తాం' అని జ‌డేజా బ‌దులు ఇచ్చాడు. జ‌డేజా స‌మాధానికి అక్కడ ఉన్న వారంతా న‌వ్వుకున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మదైన శైలిలో కామెంట్లు పెడుతున్నాడు. మొద‌టి రెండు మ్యాచ్‌ల్లో కాస్త జాగ్ర‌త్త‌గా ఆడితే ఈ ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాదని అంటున్నారు.

Next Story