భారతజట్టు బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ బాదడంతో భారత్ భారీ స్కోరును అందుకుంది. అయితే ఆఖరి 10 ఓవర్లలో అనుకున్న వేగంగా భారత్ స్కోరు చేయలేకపోవడంతో భారత్ 409 పరుగుల వద్ద ఆగిపోయింది.
బంగ్లా బౌలింగ్ ను ఊచకోత కోస్తూ ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 210 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించాడు. కోహ్లీ 85 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేసిన అనంతరం షకీబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. కోహ్లీ తన కెరీర్ లో 44వ వన్డే సెంచరీని సాధించాడు.
ఇషాన్ కిషన్.. కోహ్లీతో కలిసి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ కేవలం 126 బంతుల్లో డబుల్ సెంచరీని సాధించాడు. ఇందులో 9 సిక్స్ లు, 23 ఫోర్లు ఉన్నాయి. డబుల్ సాధించిన తర్వాత కూడా అదే ఊపులో మరో ఫోర్, మరో సిక్స్ కొట్టిన ఇషాన్ తర్వాతి బంతికి ఔట్ అయ్యాడు. ఇషాన్ మొత్తం 131 బంతులను ఎదుర్కొన్నాడు. ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులకు ఔట్ అయ్యాడు.