టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

Ireland beat England by 5 runs via D/L method.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 3:02 PM IST
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

ఆస్ట్రేలియా వేదికగా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. భారీ హిట్ట‌ర్ల‌తో కూడిన పటిష్ట‌మైన ఇంగ్లాండ్‌కు ప‌సికూన ఐర్లాండ్ గ‌ట్టి షాకిచ్చింది. మెల్‌బోర్న్ వేదిక‌గా నేడు జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ విజ‌యం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఐర్లాండ్ ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ బాల్‌బిర్ని 62, ట‌క్క‌ర్ 34 ప‌రుగులో రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్‌, లివింగ్ స్టోన్‌ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సామ్ క‌ర‌ణ్ రెండు, స్టోక్స్ ఓ వికెట్ తీశారు.

158 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్.. 14.3 ఓవర్ల‌కు 105/5 స్కోరుతో నిలిచింది. మొయిన్ అలీ 24 పరుగులతో, లియామ్ లివింగ్‌స్టోన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ ద‌శ‌లో వ‌రుణుడు ఆట‌కు అంత‌రాయం క‌లిగించాడు. ఎంత‌సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఐర్లాండ్ 5 ప‌రుగుల‌తో విజ‌యం సాధించిన‌ట్లు అంఫైర్లు ప్ర‌క‌టించారు. దీంతో ఐర్లాండ్ ఆటగాళ్లు సంబ‌రాల్లో మునిగిపోయారు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో జాషువా లిటిల్ రెండు, బ్యారీ మెక్ కార్తీ, ఫియాన్ హ్యాండ్‌, జార్జ్ డాక్రెట్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

Next Story