ముంబై ఇండియన్స్‌ని వీడనున్న రోహిత్! ఆ జట్టులోకే వెళ్తాడా..?

ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ఐదు ట్రోఫీలను అందించాడు.

By Srikanth Gundamalla  Published on  10 April 2024 3:05 PM IST
ipl, mumbai indians, rohit sharma, lucknow ,

ముంబై ఇండియన్స్‌ని వీడనున్న రోహిత్! ఆ జట్టులోకే వెళ్తాడా..?

ఐపీఎల్ సీజన్‌-2024 సందడిగా కొనసాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను చూస్తూ.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ కిక్‌ పొందుతున్నారు. అయితే.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో భారీ మార్పులు జరిగాయి. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్‌ పాండ్యాను తిరిగి తీసుకున్నారు. అంతేకాదు.. కెప్టెన్‌ బాధ్యతలను కూడా రోహిత్ శర్మను కాదని.. హార్దిక్‌కు ఇచ్చారు. దాంతో.. అప్పటి నుంచి రోహిత్‌ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ఐదు ట్రోఫీలను అందించాడు. చాంపియన్స్‌గా అవతరించేలా చేశాడు. అలాంటి ప్లేయర్‌ను కెప్టెన్‌గా తప్పించడం పట్ల హిట్‌మ్యాన్‌ అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ సందర్భంగా నేరుగా హార్దిక్‌ పాండ్యాపై కూడా విమర్శలు చేస్తున్నారు. హేళన చేస్తూ అరుపులు చేస్తున్నారు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో మొదటి మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ట్రోలింగ్ మరింత పెరిగింది. టాప్‌ పేసర్‌గా ఉన్న బుమ్రా సేవలను కూడా సరిగ్గా వినియోగించుకోవడం లేదనే విమర్శలు హార్దిక్‌ పాండ్యాపై ఉన్నాయి. దాంతో.. పాండ్యా కెప్టెన్సీని తప్పుబడుతున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్.

రోహిత్‌ శర్మ పట్ల కూడా హార్దిక్‌ ప్రవర్తన భిన్నంగా కనిపిస్తోంది. పదే పదే ఫీల్డింగ్‌ పొజిషన్‌లో మార్పులు చేస్తున్నాడు. గ్రౌండ్‌లో అటు ఇటూ పరిగెత్తిస్తున్నారు పాండ్యా. దాంతో.. రోహిత్‌ శర్మ పట్ల హార్దిక్‌కు కాస్త కూడా మర్యాద లేదని మండిపడుతున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో మరో వార్త సంచలనంగా మారింది. త్వరలోనే ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ గుడ్‌ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

రాబోయే ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టు రోహిత్‌ శర్మను సొంతం చేసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లక్నో కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్‌లో ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగ్గా.. ఎవరి పేరైనా చెప్పొచ్చా అనీ.. ఎవరి పేరు చెప్తాను అని మీరు అనుకుంటున్నానని జస్టిన్‌ తిరిగి ప్రశ్నించారు. రోహిత్ ను మీ జట్టులోకి తీసుకోగలరా అని ప్రశ్నించగా.. దానికి జస్టిన్‌ లాంగర్‌ ఒకే అతడిని ముంబై నుంచి మేం ట్రేడ్‌ చేసుకుంటామనీ.. ఈ డీల్‌ మీరే సెట్‌ చేయాలని సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2011 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్‌.. కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్‌ గెలిచాడు.

Next Story