Uppal Stadium : నేడు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. స్టేడియంలోకి అనుమ‌తి లేని వ‌స్తువులు ఇవే

ఉప్ప‌ల్ స్టేడియంలో నేడు రాజ‌స్థాన్‌, హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2023 10:16 AM IST
IPL, Uppal Stadium

ఉప్ప‌ల్ స్టేడియం

మూడేళ్ల విరామం త‌రువాత హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. నేడు(ఆదివారం) ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన మార్‌క్రమ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో ఈ మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ సార‌థ్యంలో హైద‌రాబాద్ బ‌రిలోకి దిగ‌నుంది.

మ్యాచ్ సందర్భంగా పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసు సిబ్బంది బందోబ‌స్తులో ఉన్నారు. 340 సీసీ కెమెరాల‌తో నిఘా ఉంచారు. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల కోసం 7 అంబులెన్స్‌ల‌ను సిద్దంగా ఉంచారు. మ్యాచ్ నేప‌థ్యంలో మెట్రో సేవల స‌మయాన్ని పెంచారు. మెట్రో రైళ్లను రాత్రి 1 గంట వరకు న‌డ‌ప‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12.30 నుంచి రైళ్ల ప్రీక్వెన్సీని పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. అటు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ‌సైతం నగరంలోని అన్ని డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఈ బస్సులు న‌డ‌వ‌నున్నాయి.

స్టేడియంలోకి అనుమతిలేని వస్తువులు ఇవే..

ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కెమరాలు, సిగరేట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పదునైన మెటల్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వస్తువులు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, హెల్మెట్లు, బ్యాగులు, తదితర వస్తువులు స్టేడియంలోకి అనుమతించరు.

Next Story