ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో మొత్తం 10 జట్లు బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. గత సోమవారమే కొత్త జట్ల వివరాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే.. వేలానికి స్పందించిన తేదీలు ఇంకా ఖరారు కానప్పటికి.. ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ పై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాలసీ ప్రకారం పాత జట్లు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టికోవచ్చు.
ముగ్గురు భారత ఆటగాళ్లు ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు భారత ఆటగాళ్లు ఇద్దరు విదేశీ ఆటగాళ్లు రిటైన్ చేసుకోవచ్చు. భారత ఆటగాళ్ల విషయంలో క్యాప్, అన్ క్యాప్‌డ్ ప్లేయర్లా అనేది ప్రాంచైజీలకే వదిలివేసినట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా వచ్చిన జట్లు వేలానికి ముందే అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలోంచి నేరుగా ముగ్గురిని ఎంచుకోవచ్చు. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు కాగా.. ఓ విదేశీ ఆటగాడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆ ఆటగాళ్లతో కొత్త ప్రాంచైజీలు సంప్రదింపులు జరిపిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్ల రిటైన్షన్ పూర్తి అయిన తరువాతనే మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ బావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. టీ 20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం బీసీసీఐ అధికారికంగా ఈ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది.