ఐపీఎల్ వేలంలో అప‌శృతి.. కిందపడిపోయిన ఆక్షనీర్‌.. నిలిచిపోయిన వేలం

IPL auctioneer Hugh Edmeades fine after collapsing during bidding.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2022 2:40 PM IST
ఐపీఎల్ వేలంలో అప‌శృతి.. కిందపడిపోయిన ఆక్షనీర్‌.. నిలిచిపోయిన వేలం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 మెగా వేలంలో అప‌శృతి చోటు చేసుకుంది. ఆట‌గాళ్ల వేలాన్ని నిర్వ‌హిస్తున్న ఆక్ష‌నీర్ హ్యూ ఎడ్మీయడస్ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయారు. దీంతో అక్క‌డ ఉన్న‌వారంద‌రూ ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నిర్వాహ‌కులు వేలాన్ని ఆపివేశారు. అంతేకాకుండా టీవీ ఛాన‌ళ్ల‌లో లైవ్ ప్రసారాన్ని ఆపేశారు. ఆ స‌మ‌యంలో శ్రీలంక ఆటగాడు హ‌నిండు హ‌స‌రంగ కోసం పోటీ జ‌రుగుతుండ‌గా. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అత‌డిని కొనుగోలు చేసేందుకు స‌న్‌రైజ‌ర్స్ , పంజాబ్ పోటీ ప‌డుతున్నాయి.

బ్రిటన్ జాతీయుడైన హ్యూ ఎడ్మీయడస్ 2018 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించాడు. కాగా.. మ్యాడ్లీ బ్రిటన్ లో అంపైర్ గా నియమితుడు కావడంతో అతడి స్థానంలో ఎడ్మీయడస్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గత కొన్ని సీజన్లుగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా వేలం నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు ఎడ్మీయడస్.

రైనాకు షాక్‌..

మెగావేలంలో సురేష్ రైనాకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్‌లో 5 వేలకు పరుగులు చేసిన సురేష్ రైనాని తొలి రౌండ్‌లో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చిన్న తలా ను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే కూడా బిడ్ వేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది .బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. బిగ్‌బాష్ లీగ్ 2022 సీజన్‌‌లో అదరగొట్టినప్పటికీ షకీబ్‌ను కొనుక్కోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.

Next Story