రసవత్తరంగా ప్లేఆఫ్స్‌ రేసు.. లక్నోపై సన్‌రైజర్స్ గెలవాల్సిందే..!

ఐపీఎల్-2024 సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారుతోంది.

By Srikanth Gundamalla  Published on  7 May 2024 5:45 PM IST
ipl-2024, sunrisers Hyderabad,  lucknow,

రసవత్తరంగా ప్లేఆఫ్స్‌ రేసు.. లక్నోపై సన్‌రైజర్స్ గెలవాల్సిందే..!

ఐపీఎల్-2024 సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో ఆసక్తికర పోరుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ముంబై చేతిలో ఓటమిని చూసిన సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ను కష్టతరం చేసుకుంది. ఇక సొంతమైదానంలో ఉప్పల్‌ వేదికగా రేపు లక్నో సూపర్‌జెయింట్స్‌తో హైదరాబాద్ టీమ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ రేసులో ముందంజలో ఉండాలంటే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. లక్నోతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలి. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌... ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

ఈ సీజన్‌ ఆరంభంలో ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. కానీ.. రానురాను మార్పు వచ్చింది. మొదటి ఆరు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ ఐదింటిలో విజయాలతో రాణించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ టీమూ సాధించని మొత్తం స్కోరును రాబట్టింది. ఆ తర్వాత మరోసారి తమ రికార్డును తామే బ్రేక్‌ చేసింది ఎస్‌ఆర్ హెచ్. దాంతో.. ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టింది. కానీ.. చివరి నాలుగు మ్యాచుల్లో మాత్రం ఒకే ఒక్క విజయం సాధించింది. ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారడంతో మిగిలిన మూడు మ్యాచ్‌లు హైదరాబాద్‌కు ఎంతో కీలకం కానున్నాయి.

కోల్‌కతా, రాజస్థాన్‌ టీమ్‌లు తదుపరి దశకు చేరడం దాదాపు ఖాయం అయ్యింది. మిగిలిన రెండు స్థానాల కోసం ఇప్పుడు పోటీ ఉంది. దీని కోసం చెన్నై, లక్నో సూపర్‌ జెయింట్స్‌తో పాటు హైదరాబాద్‌ కూడా పోటీ పడుతోంది ఈ మూడు టీమ్‌లు కూడా 12 పాయింట్లతో సమంగా సాధించాయి. కానీ నెట్‌ రన్‌రేటు విషయంలో నెగటివ్‌లో ఉండటంతో నాలుగో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో లక్నోపై హైదరాబాద్ గెలవకపోతే తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోతుంది.

దాంతో.. లక్నోపై గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో ముందుగా ఉండాలని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో పలు మార్పులు చేసినా విఫలమయ్యారు. మార్క్‌రమ్ స్థానంలో జేన్సన్‌ను తుదిజట్టులోకి తీసుకు వచ్చిన గత వ్యూహం విఫలమైంది. అందుకే మార్క్‌రమ్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చి గెలుపుబాట పట్టాలని భావిస్తోంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ తుది జట్టు (అంచనా):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్.

Next Story