స్కూల్ పిల్లలతో క్రికెట్ ఆడిన SRH కెప్టెన్ కమిన్స్.. వైరల్ వీడియో

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దుమ్మురేపింది.

By Srikanth Gundamalla  Published on  17 May 2024 5:15 PM IST
ipl-2024, sunrisers, captain cummins,  govt school, viral video,

స్కూల్ పిల్లలతో క్రికెట్ ఆడిన SRH కెప్టెన్ కమిన్స్.. వైరల్ వీడియో 

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దుమ్మురేపింది. రికార్డు స్కోర్‌ ను నమోదు చేసి.. మళ్లీ తమ స్కోర్‌ను తామే బ్రేక్‌ చేశారు. ఈసారి పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలో సన్‌రైజర్స్‌ బాగా రాణిస్తున్నారని అంటున్నారు క్రీడా నిపుణులు. అతని కెప్టెన్సీ ద్వారా ప్లేఆఫ్స్‌ వరకు చేరగలిగిందని అంటున్నారు. దాంతో.. పాట్‌ కమిన్స్‌పై తెలుగు క్రికెట్‌ అభిమానులు ప్రేమను పెంచేసుకుంటున్నారు. గతంలో డేవిడ్‌ వార్నర్‌ తర్వాత మరో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌గా పాట్ కామిన్స్‌ తెలుగు ప్రజల ఆదరణ పొందుతున్నాడు. అందుకు తగ్గట్లే కమిన్స్‌ కూడా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఓ స్కూల్‌కి వెళ్లిన అతను.. సరదాగా పిల్లలతో క్రికెట్‌ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ ఈసారి మాత్రం దుమ్మురేపింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఒకవేళ పంజాబ్‌ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా టాప్‌-2లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇలా జరగాలంటే కేకేఆర్-రాజస్థాన్ ఫలితంపైనా ఆధారపడాల్సి ఉంది. రాజస్థాన్ ఓడిపోతేనే ఇది సాధ్యం అవుతుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ సాధించిన విజయాల్లో కెప్టెన్ కమిన్స్‌ పాత్ర కీలకం. సందర్భాన్ని బట్టి మిడిల్ ఓవర్లు, డెత్‌ ఓవర్లు వేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అంతేకాక బ్యాటింగ్‌తో కూడా రాణించాడు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ సహా క్లాసెన్, మర్‌క్రమ్ రాణించిన తీరు క్రికెట్‌ అభిమానులను కట్టిపడేసింది.

ఈ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ తాజాగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పరిధిలో ఉన్న కర్మన్‌ఘాట్‌ గవర్నమెంట్‌ స్కూల్‌కి వెళ్లాడు. అక్కడ విద్యార్థులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. పాఠశాల ఆవరణలో ఉన్న గ్రౌండ్‌లో కాసేపు పిల్లలతో క్రికెట్‌ ఆడాడు. ఆల్‌రౌండర్‌ అయిన కమిన్స్‌ స్కూల్‌లో వికెట్ కీపర్‌గా కూడా ఆడాడు. విద్యార్థులు బ్యాటింగ్ చేస్తుంటే.. వికెట్ల వెనుక గ్లవ్స్‌ వేసుకుని బంతిని అందుకున్నాడు. బ్యాటింగ్‌ చేసి స్టూడెంట్స్‌ను అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమిన్స్‌ సరదాగా పిల్లలతో సమయాన్ని గడపడంతో నెటిజన్లు అతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Next Story