IPL-2024: 3 ప్లేఆఫ్స్‌‌ బెర్త్‌లు.. 6 టీమ్‌లు.. గెలుపెవరిదో!

ఐపీఎల్-2024 సీజన్‌ అద్బుతంగా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  14 May 2024 11:59 AM IST
ipl-2024,  playoffs, cricket,

IPL-2024: 3 ప్లేఆఫ్స్‌‌ బెర్త్‌లు.. 6 టీమ్‌లు.. గెలుపెవరిదో!

ఐపీఎల్-2024 సీజన్‌ అద్బుతంగా కొనసాగుతోంది. గతంలో ఉన్న రికార్డులన్నీ ఈ సీజన్‌లో బ్రేక్‌ అయ్యాయి. తాజాగా ప్లే ఆఫ్స్‌ రేసు కూడా రసవత్తరంగా మారింది. లీగ్‌ దశ తుది అంకానికి చేరుకున్నా కూడా మూడు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాలేదు. ఈ మూడు బెర్త్‌ల కోసం ఆరు టీమ్‌లు తీవ్రంగా పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్‌ టైటాన్స్‌ వైదొలిగాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రమే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్లు.. మూడు ప్లేఆఫ్స్‌ బెర్త్‌లు.. ఇలా ఐపీఎల్ రేసు రసవత్తరంగా మారింది. ఆరు టీముల్లో ఎవరెవరు ప్లేఆఫ్స్‌కి చేరుకుంటారో..!

రాజస్థాన్ రాయల్స్:

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ అద్భుతంగా రాణించింది. కానీ.. చివరి కొన్ని మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూసింది. రాజస్థాన్‌ టీమ్‌ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడగా.. 8 సార్లు విజయాన్ని అందుకుంది. కాగా.. ఇప్పటికైతే రాజస్థాన్ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేదనే చెప్పాలి. చివరగా ఈ టీమ్‌ 2 మ్యాచ్‌లు ఆడబోతుంది. అందులో ఒక్కటి గెలిచినా ఫ్లే ఆఫ్స్‌ కన్ఫమ్‌ అయినట్లే. రెండు గెలిస్తే మాత్రం మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది. పంజాబ్, కోల్‌కతాలతో ఆడే చివరి రెండు మ్యాచుల్లో ఓడినా కూడా రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు ఇబ్బంది లేదు. కానీ.. చిత్తుగా ఓడిపోకుండా చూసుకోవడం మాత్రం మంచిది.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

రాజస్థాన్ రాయల్స్ తర్వాత మెరుగైన అవకాశాలు సన్‌రైజర్స్‌ టీమ్‌కు ఉన్నాయి. హైదరాబాద్ టీమ్ 12 మ్యాచ్‌ లు ఆడి ఏడింటిలో విజయాన్ని చూసింది. గుజరాత్, పంజాబ్‌లతో తర్వాతి మ్యాచ్‌లు ఆడబోతుంది ఈ టీమ్. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. నెట్‌ రన్‌రేట్‌ బాగానే ఉంది కాబట్టి.. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా ముందంజ వేస్తుంది. రెండు మ్యాచుల్లో ఓడితే మాత్రం.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్:

చెన్నై టీమ్‌కి కూడా ప్లేఆఫ్స్‌కి చేరేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. 13 మ్యాచులు ఆడిన చెన్నై.. ఏడు మ్యాచుల్లో గెలిచింది. చివరి మ్యాచ్‌లో బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. రన్‌రన్‌ మెరుగ్గా ఉంది కాబట్టి.. ఇందులో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కి చేరుకున్నట్లే అవుతుంది. ఒక వేళ ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

లక్నో సూపర్ జెయింట్స్:

లక్నో టీమ్‌ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచుల్లో విజయాన్ని అందుకుంది. ఇంకా ప్లే ఆఫ్స్‌ రేసులోనే ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, ముంబైతో ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఈ టీమ్‌కు సజీవంగా ఉంటాయి. అయితే.. రెండు మ్యాచుల్లో గెలవడంతో పాటు నెట్‌ రన్‌రేటును మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రన్‌ రేట్‌ మైనస్‌లో ఉంది.. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్స్‌ కష్టమే.

ఢిల్లీ క్యాపిటల్స్:

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో గెలిచింది. నెట్‌ రన్‌రేట్‌లో వెనుకబడి ఉంది. చివరి మ్యాచ్‌లో లక్నోపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇతర జట్ల సమీకరణాలపైనా ఆధారపడాల్సి ఉంటుంది. లక్నోపై ఢిల్లీ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే.

రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు:

బెంగళూరు టీమ్‌ ఇక ఇంటికి వెళ్తుంది అన్న సమయానికి బాగా పుంజుకుంది. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చింది. 13 మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలను అందుకుంది. లీగ్‌ దశలో బెంగళూరు తన చివరి మ్యాచ్‌ చెన్నైతో ఆడనుంది. ఒకవేళ చెన్నైపై గెలిస్తే.. సమీకరణాలు కలిసి వస్తే ముందంజ వేయవచ్చు. ఇక రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటం ఈ టీమ్‌కు కలిసి వస్తుంది. హైదరాబాద్‌, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నై, బెంగళూరు మ్యాచ్‌ కీలకం కానుంది.

Next Story