ఢిల్లీ క్యాపిటల్స్‌కు రోహిత్..? కెప్టెన్సీ ఇవ్వనున్నారా..?

రాబోయే సీజన్‌లో రోహిత్‌ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  17 Dec 2023 9:37 AM GMT
ipl-2024, delhi capitals,  rohit sharma, mumbai indians,

 ఢిల్లీ క్యాపిటల్స్‌కు రోహిత్..? కెప్టెన్సీ ఇవ్వనున్నారా..?

ఇండియాలో క్రికెట్‌కు ఫ్యాన్స్‌ ఎక్కువగానే ఉంటారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లే కాదు.. దేశంలో జరిగే ఐపీఎల్‌ సీజన్‌కు ఎంతో క్రేజ్‌ ఉంటుంది. ఐపీఎల్‌ సీజన్-2024కు మరో నాలుగు నెలల సమయం ఉంది. అప్పుడే హడావిడి మొదలయ్యింది. ఇప్పటికే ఆయా టీముల్లో మార్పులు కూడా జరిగాయి. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమించింది. ఆ స్థానంలో ఉన్న రోహిత్‌ శర్మను తొలగించింది. దాంతో.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ షాక్‌లు ఇస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆ ఫ్రాంచైజీ పేజ్‌ను అన్‌ఫాలో చేయడమే కాదు.. తీవ్ర విమర్శలను సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రాబోయే సీజన్‌లో రోహిత్‌ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2024 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రోహిత్‌ శర్మ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అతను రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని మళ్లీ ఐపీఎల్ ఆడతాడని అంతా భావిస్తున్నా కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి భారం మోపే యోచనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ లేదు. దాంతో.. రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ ఇచ్చి పంత్‌ను ఈ సీజన్‌ వరకు సాధారణ ఆటగాడిగా కొనసాగించాలని భావిస్తోందని సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

రోహిత్‌ శర్మను తమ టీమ్‌లోకి కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ను సంప్రదించిందని సమాచారం. కానీ ప్రస్తుతానికి ఈ ఆపర్‌ను ముంబై మేనేజ్‌మెంట్‌ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ.. ట్రేడ్‌ విండో డిసెంబర్‌ 20 నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను బదిలీ చేసుకోవడానికి ట్రేడ్‌ విండో ద్వారా ఫ్రాంచైజీలకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ ట్రేడ్‌ విండో ద్వారానే రోహిత్‌ను దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే..ఇది ఎంత వరకు సాధ్యమనేది ఇప్పుడే చెప్పలేం. మరోవైపు సన్‌రైజర్స్‌ కూడా రోహిత్‌ను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌ చరిత్రలో మంచి విన్నింగ్‌ పర్సంటేజ్‌తో కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్‌ శర్మను ముంబై ఇండియన్స్ ఇటీవల అనూహ్యంగా బాధ్యతల నుంచి తీసేసింది. మరి రోహిత్ ముంబైలోనే ఉంటాడా? లేదంటే ఇతర టీమ్‌లు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇస్తాయా అన్నది చూడాలి.

Next Story