IPL-2024: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. షమీ ఔట్!

కొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సీజన్-2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌ ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 4:45 PM IST
ipl-2024, cricket,  bowler shami, treatment,

IPL-2024: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. షమీ ఔట్!

టీమిండియా స్టార్‌ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌ కప్‌2023లో అయితే షమీ బౌలింగ్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తి పోయారనే చెప్పాలి. టీమిండియా విజయాల్లో షమీ కీలక పాత్ర పోషించాడు. అయితే.. రానున్న కొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సీజన్-2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌ ఎదురైంది.

పేసర్ షమీ ఎడమ చీలండ గాయం కారణంగా వచ్చే నెలలో జరగబోయే ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కానున్నాడనీ.. అతను యూకేలో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వెళ్లనున్నట్లు పీటీఐ నివేదికలు చెబుతున్నాయి. కాగా.. షమీ ప్రస్తుతం గాయం కారణంగా భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. షమీ గతేడాది చివరి సారి నవంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్ తరఫున ఆడాడు. గాయం కారణంగా అప్పటి నుంచి బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

అయితే.. ఎంతకీ గాయం మానకపోవడంతో షమీ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో..అతను త్వరలోనే యూకే వెళ్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం అయ్యే ఐపీఎల్‌లో ఆడటం కష్టమే అంటున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌-2023లో 24 వికెట్లు తీశాడు షమీ. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇటీవల షమీ అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. షమీ వంటి అద్బుత బౌలర్‌ గుజరాత్‌కు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద నష్టమే అని చెప్పాలి. మరోవైపు ఇప్పటి వరకు గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాను ముంబై జట్టు తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story