IPL-2024: ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న SRH.. ఎందుకంటే
ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 5:21 PM ISTIPL-2024: ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న SRH.. ఎందుకంటే
ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు కప్‌పై కన్నువేసింది. ఫైనల్ వరకు వచ్చిన ఆరెంజ్ ఆర్మీ.. ఎలాగైనా కప్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలబడబోతుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తుది పోరు జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేకేఆర్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. కాగా.. ఇదే చెపాక్ స్టేడియంలో శుక్రవారం క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ టీమ్ తలపడి విజయాన్ని అందుకుంది. తద్వారా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. శనివారం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆదివారం కేకేఆర్‌తో ఫైనల్‌లో ఆడాలని టీమ్ నిర్ణయం తీసుకుంది. కాగా.. చెన్నైలో ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉన్న కారణంగా ఆటగాళ్లను ఫిట్‌గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. మరోవైపు క్వాలిఫైయర్-1 మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా మధ్య జరిగింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఫైనల్ మ్యాచ్‌కి కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా సుదీర్ఘ విరామం పొందింది. కేకేఆర్ శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. ఇక శనివారం కూడా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 వరకు ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. వారు కచ్చితంగా ప్రాక్టీస్ చేయడం వెనుక కారణాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. గుజరాత్, రాజస్థాన్‌తో జరగాల్సిన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దాంతో.. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతో ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం ప్రధాన కారణమని చెబుతున్నారు.