ఇవాళే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌.. మరి విజేత ఎవరో..!

ఐపీఎల్‌-2024 సీజన్‌ చివరి మ్యాచ్‌ కు సమయం ఆసన్నమైంది.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 1:58 AM GMT
ipl-2024, cricket, final match, SRH Vs KKR,

 ఇవాళే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌.. మరి విజేత ఎవరో..!

ఐపీఎల్‌-2024 సీజన్‌ చివరి మ్యాచ్‌ కు సమయం ఆసన్నమైంది. ఈ సారి టైటిల్ విజేత ఎవరో అని అందరిలో ఆసక్తి కొనసాగుతోంది. గత మూడు సీజన్లలో పెద్దగా రాణించలేకపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక వైపు.. గత రెండు సీజన్లలో కోల్‌కతా కూడా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండిపోయింది. అలాంటి టీమ్‌లు ఈ సారి ఫైనల్‌ వరకు వస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ రెండు టీమ్‌లు అద్భుత ప్రదర్శనను కనబరస్తూ చివరి వరకు నిలబడ్డాయి. ఫైనల్‌కు చేరాయి. ఇప్పుడు టైటిల్‌ పోరుకు సిద్ం అయ్యాయి.

బ్యాటింగ్‌తో అదరగొడుతూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్లో అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. తాము క్రియేట్‌ చేసిన రికార్డు వారే బ్రేక్‌ చేశారు కూడా. ఇక మరోవైపు కోల్‌కతా అన్నింట్లోనూ అద్భుత ప్రదర్శన ఇస్తూ అగ్రస్థానంలో ముందుకు దూసుకెళ్లింది. పదేళ్ల క్రింద చివరి సారి విజేతగా నిలిచిన కోల్‌కతా మూడో సారి టైటిల్‌ గెలవాలని పట్టుదలతో ఉంటే.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా నిలవాలని.. రెండో ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని హైదరాబాద్ సన్‌రైజర్స్‌ ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు అన్ని రంగాల్లో బలంగానే కనిపిస్తున్నాయి. దాంతో.. ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా కొనసాగేఅవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఈ మైదానంలో ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తి కొనసాగుతోంది. ఫైనల్‌ కోసం హైదరాబాద్‌ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్‌-3లో హెడ్‌, అభిషేక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న మెడ్‌ ఫైనల్‌లో చెలరేగాల్సి ఉంటుంది. ఇక మరోవైపు అభిషేక్‌ కూడా భారీ షాట్స్ ఆడుతూ అద్భుత ఆరంభాన్ని ఇవ్వాలి. ఇక మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో దూకుడుగా ఆడిన త్రిపాఠి మరోసారి అదే ఫామ్‌ను కొనసాగిస్తే హైదరాబాద్‌కు మంచి ఆరంభం లభిస్తుంది. ఎప్పటిలానే మిడిలార్డర్‌లో క్లాసెన్‌ ఉన్నాడు. అతను స్కోరు బోర్డును మరింత ముందుకు తీసుకెళ్తాడు. ఇక మరోవైపు మన ఇండియా బ్యాటర్లు నితీశ్ రెడ్డి, సమద్‌లు కూడా మరోసారి తమ టాలెంట్‌ను చూపించాల్సి ఉంటుంది.

నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం ఉంది. మార్క్‌రమ్‌ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. లీగ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా పిలిప్స్‌నుతీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్‌ను అనూహ్యంగా ఇపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకొచ్చింది టీమ్‌. ఇక ఫైనల్‌లో వీరిలో ఎవరిని తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కమిన్స్‌, భువనేశ్వర్, నటరాజన్‌ పేస్‌ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనను ఇస్తూనే ఉన్నారు.

కోల్‌కతా మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ఆడిన టీమ్‌నే ఆడించే చాన్స్‌లు ఉన్నాయి. మొదట్నుంచి ఈ టీమ్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం కలిసివచ్చే అంశం. ఓపెనర్లు నరైన్‌, గుర్భాజ్‌ సత్తా చాటగలరు. వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక చివర్లో రింకూ, రసెల్ విధ్వంసం సృష్టించగల బ్యాటర్లు. బౌలింగ్‌లో కూడా కేకేఆర్‌ అద్భుతంగా ఆడుతుంది. స్టార్క్‌ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుందో గత మ్యాచ్‌లో హైదరాబాద్కు అర్థమైంది. మరోవైపు హిర్షిత్, అరోరా పేసర్లు కూడా ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్‌ వరుణ్ కూడా మంచి స్పెల్‌తో రాణిస్తున్నాడు.

తుది జట్లు (అంచనా):

హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్, త్రిఫాఠి, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్‌రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనద్కట్, నటరాజన్, షహబాజ్/మర్కండే

కోల్‌కతా నైట్‌ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్‌, హర్షిత్, వరుణ్, వైభవ్

క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో నల్లరేగడి మట్టితో ఉన్న పిచ్‌పై ఆడించారు. ఇది స్పిన్‌కు అనుకూలించింది. కానీ ఫైనల్‌ మ్యాచ్‌కు ఎర్రమట్టితో కూడిన పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో.. బ్యాటింగ్‌కు ఇది అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. భారీ స్కోరు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు చెన్నైలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఇక మ్యాచ్‌ రోజు ఆదివారం వర్షం కురిసి మ్యాచ్‌ రద్దు అయితే... ఆ తర్వాత రోజు రిజర్వ్‌డే ప్రకటించారు. సోమవారం మ్యాచ్‌ కొనసాగుతుంది. ఒకవేళ ఆరోజు కూడా వర్షం పడి మ్యాచ్‌ రద్దు అయితే.. పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌లో ఉన్న టీమ్‌ను విజేతగా ప్రకటిస్తారు.

Next Story