ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. కెప్టెన్‌ పంత్‌ సహా ఆటగాళ్లకు జరిమానా

ఐపీఎల్‌ సీజన్‌ 2024 ఉత్సాహంగా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 10:51 AM IST
ipl-2024, cricket, delhi capitals, bcci, fine, rishabh pant ,

ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. కెప్టెన్‌ పంత్‌ సహా ఆటగాళ్లకు జరిమానా

ఐపీఎల్‌ సీజన్‌ 2024 ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు స్కోరుని నమోదు చేసింది. ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా కూడా భారీ టార్గెట్‌ను ఉంచింది. ఏడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ చేసిన 277 పరుగుల రికార్డును బ్రేక్‌ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ.. చివర్లో వికెట్లు పడటంతో హైదరాబాద్‌ రికార్డు అలాగే ఉండిపోయింది. అయితే.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌.. కేకేఆర్‌ చేతిలో ఘోర ఓటమిని చూసింది.

అయితే.. ఓటమితో పాటుగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌ తగిలింది. కెప్టెన్ రిషబ్‌ పంత్‌ సహా జట్టు ఆటగాళ్లందరికీ భారీ జరిమానా విధించింది బీసీసీఐ. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత కోల్‌కతా బ్యాటింగ్ చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(25 బంతుల్లో 55), ట్రిస్టన్‌ స్టబ్స్‌(32 బంతుల్లో 54) కాసేపు మెరుపులు మెరిపించారు. కానీ చివరకు కేకేఆర్ చేతిలో ఢిల్లీ 106 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. దాంతో.. బీసీసీఐ చర్యుల తీసుకుంది. ఈ మేరకు కెప్టెన్ రిషబ్‌ పంత్‌తో పాటు జట్టు ఆటగాళ్లందరికీ జరిమానా విధించింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా బీసీసీఐ విడుదల చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ స్లో ఓవర్‌ రేటు మెయింటేన్ చేసిందని పేర్కొంది. అందుకే ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌తో పాటు జట్టుకు కూడా జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. అయితే.. అంతకుముందు చెన్నైతో మ్యాచ్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే తప్పు చేసింది.

మొదటిసారి తప్పులో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు రూ.12లక్షల ఫైన్ విధించారు. ఇక రెండోసారి కూడా అదే తప్పు రిపీట్ చేసినందుకు గాను కెప్టెన్‌కు భారీ ఫైన్ వేశారు. పంత్‌కు రూ.24లక్షల జరిమానాతో పాటు.. తుదిజట్టులోని ఢిల్లీ ఆటగాళ్లందరు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అభిషక్ పోరెల్‌తో సహా ఒక్కొక్కరికి రూ.6లక్షల చొప్పున జరిమానా విధించింది. ఒక వేళ ఇది కాకపోతే మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు.


Next Story