IPL-2024: కొత్త రోల్‌లో ధోనీ, మరి చెన్నై కెప్టెన్‌ ఎవరు?

ధోనీ ఐపీఎల్‌లో ఆడతారా లేదా అనే చర్చ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 12:32 PM IST
ipl-2024, chennai super kings, ms dhoni, cricket,

IPL-2024: కొత్త రోల్‌లో ధోనీ, మరి చెన్నై కెప్టెన్‌ ఎవరు?

ఐపీఎల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ కొనసాగినన్ని రోజులు క్రికెట్‌ అభిమానులకే పండగ వాతవరణమే ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఉన్న క్రేజ్‌ వేరు అని చెప్పాలి. ఎందుకంటే ఆ టీమ్‌లో ఎంఎస్‌ ధోనీ ఉంటారు. అయితే.. ఇటీవల కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. స్వయంగా ఎంఎస్‌ ధోనీనే ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. దాంతో.. ధోనీ ఐపీఎల్‌లో ఆడతారా లేదా అనే చర్చ జరుగుతోంది.

ఇటీవల ఎంఎస్‌ ధోనీ సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 'కొత్త సీజన్‌లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి' అంటూ ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకున్నారు. కొత్త పాత్ర ఏంటో అంటూ ఆయన అభిమానులు.. క్రికెట్‌ ఫాలోవర్స్‌ తెగ చర్చించుకుంటున్నారు. మరోవైపు కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో ఆడేందుకు గుడ్‌బై చెబుతారని సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్‌కే టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ధోనీ సీఎస్‌కే మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ధోనీ మాత్రమే కాదు.. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ పెట్టిన పోస్టు కూడా మరింత సస్పెన్స్‌ను పెంచుతుంది. 'కొత్త పాత్రలో లియో' అంటూ ఓ ట్వీట్‌ చేసింది. దాంతో.. ఈ సీజన్‌లో మెంటార్‌గా ఎంఎస్‌ ధోనీ కొత్త బాధ్యతలు చేపట్టడం ఖాయమే అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. ఆ టీమ్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఏడాదిపాటు క్రికెట్ మైదానంలో దిగలేదు. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ చెన్నై, బెంగళూరు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించింది చెన్నై జట్టు. కానీ.. ధోనీ మాత్రం ఈ ట్రెయినింగ్‌ క్యాంప్‌లో చేరలేదు. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్‌లో ధోనీ ఆడబోవడం లేదనీ తెలుస్తోంది. ఇక ధోనీ టీమ్‌ నుంచి తప్పుకుంటే సీఎస్‌కే కెప్టెన్‌గా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి.

Next Story