ఐపీఎల్-17 వేరే దేశంలో జరుగుతుందా..? ఎందుకు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ వేలం గురించి చర్చలు జోరందుకున్నాయి.
By Medi Samrat Published on 1 Dec 2023 9:18 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ వేలం గురించి చర్చలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపీఎల్-2024 వేదిక మారనుందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ భారత్‌లో కాకుండా వేరే దేశంలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో భారత్ కాకపోతే టోర్నీ ఎక్కడ నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా పెద్ద ప్రశ్న.
నిజానికి ఈ ప్రశ్న ఎందుకు తలెత్తుతోంది అంటే.. ఐపీఎల్-2024 జరిగే సమయంలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఐపీఎల్ నిర్వహణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల తర్వాత ఐపీఎల్‌ను నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఓ ఇంటర్వ్యూలో.. భారత్ లోనే ఐపీఎల్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అయితే దీనిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పిటిఐ ప్రకారం.. ఐపీఎల్ వేదిక, తేదీలపై నిర్ణయం ఎన్నికల కమిషన్‌దేనని.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ, పూర్తి షెడ్యూల్‌ను నిర్ణయించిన తర్వాత ఐపీఎల్ 2024కి సంబంధించి గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. దీని ప్రకారం.. ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహించాలి.. పూర్తిగా భారత్‌లో నిర్వహించాలా లేదా పాక్షికంగా నిర్వహించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంటే ఐపీఎల్‌లో సగం భారత్‌లో, సగం వేరే చోట ఉండే అవకాశం కూడా లేకపోలేదు.
ఇంతకు ముందు కూడా లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను మార్చారు. 2009లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ని దక్షిణాఫ్రికాకు మార్చారు. దీని తరువాత.. 2014లో UAE, భారత్‌లో జరిగింది. ఆ తర్వాత ఎలాంటి మార్పు లేకుండా టోర్నమెంట్ భారత్‌లోనే జరుగుతుంది. తాజాగా 2024 వేదికపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డిసెంబర్ 19న ఈ టోర్నీ వేలం కూడా తొలిసారిగా భారత్ వెలుపల జరుగుతోంది. వేలం దుబాయ్‌లో జరగనుంది.