రేపే ఐపీఎల్ వేలం.. ఆ ఇద్ద‌రిని ఆర్సీబీ ద‌క్కించుకుంటే.. ఈసారి ట్రోఫీ ఖాయం.!

ఐపీఎల్ 2024 వేలానికి సన్నాహాలు పూర్తయ్యాయి. రేపు అంటే డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం మార్కెట్ నిర్వహించబడుతుంది.

By Medi Samrat  Published on  18 Dec 2023 3:16 PM IST
రేపే ఐపీఎల్ వేలం.. ఆ ఇద్ద‌రిని ఆర్సీబీ ద‌క్కించుకుంటే.. ఈసారి ట్రోఫీ ఖాయం.!

ఐపీఎల్ 2024 వేలానికి సన్నాహాలు పూర్తయ్యాయి. రేపు అంటే డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం మార్కెట్ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఆటగాళ్లపై కోట్ల విలువైన బిడ్‌లు వేయబడతాయి. ఈ ఐపీఎల్ చాలా ప్ర‌త్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ సీజన్‌లో జట్లలో చాలా పెద్ద మార్పులు కనిపించ‌నున్నాయి. హార్దిక్ పాండ్యా ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ వెంట‌నే రోహిత్ స్థానంలో పాండ్యా ముంబైకి కెప్టెన్ అయ్యాడు. ఇదిలావుంటే.. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతుంది. ఇద్దరు ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకుంటే RCB ఈ IPL సీజన్‌లో అత్యంత ప్రాణాంతక జట్టుగా మారుతుందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌ద్ద వేలానికి ఖ‌ర్చుపెట్టాల్సిన డబ్బు చాలానే ఉంది. RCB పర్స్‌లో మొత్తం రూ. 41 కోట్లు ఉంది. దీంతో వారు కామెరాన్ గ్రీన్‌ను ముంబై నుంచి రూ. 17.5 కోట్లకు ట్రేడ్‌ చేశారు. ఇప్పుడు RCB వ‌ద్ద‌ మొత్తం 23.5 కోట్లు మిగిలాయి. దీంతో ఇద్దరు మంచి ఆటగాళ్లపై బెట్టింగ్ వేసేందుకు RCBకి మంచి అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ICC వరల్డ్ కప్ 2023లో విధ్వంసం సృష్టించాడు. అత‌డు ప్రపంచ కప్‌లో కేవలం 10 మ్యాచ్‌లలో 578 పరుగులు చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ పరంగా నాల్గవ స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు బౌలింగ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. దీంతో RCB ఖచ్చితంగా రచిన్ రవీంద్రపై పందెం వేసేందుకు ఆలోచ‌న చేస్తుంది.

RCB మరో ఆటగాడు, ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని కూడా తమ జట్టులో చేర్చుకోవాలని చూస్తుంది. ప్రపంచకప్‌లో ఈ ఆటగాడు కూడా రాణించాడు. హెడ్ ​​ఇండియాతో ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్ ను అందించాడు. దీంతో RCB హెడ్ కోసం వేలం వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకుంటే.. ఈ IPL సీజన్‌లో RCB విజయం దాదాపు ఖాయం అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

ఇదిలావుంటే.. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు ఉండ‌గా.. వారిలో 214 మంది భారతీయులు, 116 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ 333 మంది ఆటగాళ్లలో కేవ‌లం 70 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మొత్తం 10 జట్లతో కలిపి 70 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జ‌ట్టులో అత్యధిక స్లాట్‌లను ఖాళీగా ఉన్నాయి. కోల్‌కతా జట్టులో మొత్తం 12 మంది ఆటగాళ్లను చేర్చుకునే అవ‌కాశం ఉంది. ఈ వేలంలో ఖ‌ర్చుచేసేందుకు గుజరాత్ టైటాన్స్ వ‌ద్ద అత్య‌ధికంగా రూ.38.15 కోట్లు ఉన్నాయి.

Next Story