IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్టేది..?
ఐపీఎల్ రేసు తుది అంకానికి చేరువైంది. లీగ్ దశలో కేవలం ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ కు నాలుగు జట్లు వెళ్తాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2023 7:32 AM GMTIPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్టేది..?
ఐపీఎల్ రేసు తుది అంకానికి చేరువైంది. లీగ్ దశలో కేవలం ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ కు నాలుగు జట్లు వెళ్తాయి. అందులో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 13 మ్యాచులకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది. సీఎస్కే, ఎల్ఎస్ జీ చెరో ఏడు విజయాలతో 15 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచులకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
15 పాయింట్లతో ఉన్న ఎల్ఎస్ జీ, సీఎస్కే జట్లు ఇంకా ఒక్కో మ్యాచులో ఆడాల్సి ఉంది. అవి విజయం సాధిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్ కు వెళ్లిపోతాయి. ఇక మరో స్థానం కోసమే మిగిలిన జట్ల మధ్య పోటీ ఉంటుంది. పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ జట్లు ఆరేసి విజయాలతో ఉన్నాయి. బెంగళూరు జట్టు నేడు సన్ రైజర్స్ తో, వచ్చే ఆదివారం గుజరాత్ తో తలపడనుంది. ఈ రెండింటిలో బెంగళూరు విజయం సాధిస్తే అప్పుడు తన ఖాతాలో 16 పాయింట్లు పడతాయి. లక్నో, సీఎస్కే మిగిలిన మ్యాచుల్లో ఓడిపోతే అప్పుడు 15 పాయింట్ల వద్దే ఉండిపోతాయి. దీంతో బెంగళూరు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరుతుంది.
బెంగళూరు మిగిలిన మ్యాచుల్లో ఒక్కదాని లోనే గెలిస్తే 7 విజయాలతో 14 పాయింట్ల దగ్గర నిలిచిపోతుంది. ముంబై జట్టు మిగిలిన మ్యాచ్ కీలకం అవుతుంది. సన్ రైజర్స్ పై ముంబై విజయం సాధిస్తే అప్పుడు ప్లేఆఫ్ కు ముంబై చేరిపోతుంది. బెంగళూరు ఒక విజయం సాధించి, ముంబై తన చివరి మ్యాచ్ ఓడిపోతే రెండు జట్ల పాయింట్లు సమానం అవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటు కీలకంగా మారుతుంది. ఒకవేళ చెన్నై చివరి మ్యాచు విజయం సాధిస్తే, బెంగళూరు రెండింటిలోనూ గెలిస్తే, ముంబై కూడా చివరి మ్యాచ్ గెలిస్తే, లక్నో జట్టు కేకేఆర్ పై ఓడిపోతే.. లక్నో ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఈ వారం ప్రతి మ్యాచ్ కూడా కీలకం కానుంది.