ఐపీఎల్ 2022.. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు
IPL 2022 Play offs and final venue announced.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్ రసత్తవరంగా సాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 24 April 2022 12:59 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్ రసత్తవరంగా సాగుతోంది. బౌండరీలతో విరుచుకుపడతారని ఆశించిన స్టార్ ఆటగాళ్లు విఫలం అవుతుండగా.. అసలు ఏ మాత్రం అంచనాలు లేని ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. ప్రతి మ్యాచ్ అభిమానులకు అసలు సిసలు క్రికెట్ మజాను అందిస్తోంది. ఈ సీజన్‌లో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వడంతో లీగ్‌లో పాల్గొంటున్న జట్ల సంఖ్య పదికి చేరినప్పటికీ.. గత సీజన్లలో లాగే 74 మ్యాచులకే పరిమితం చేశారు. 10 జట్లను రెండు గ్రూపులు విభజించారు. ఇప్పటి వరకు 35 మ్యాచులు జరుగగా.. మరో 35 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
కాగా.. ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌నే విడుదల చేయగా.. ఆదివారం ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసింది. మే 24, 26 తేదీల్లో జరగనున్న క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక లీగ్ మ్యాచ్‌లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతి ఇస్తుండగా.. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు వందశాతం ప్రేక్షకులను అనుమతించనట్లు చెప్పారు. ఇక మహిళల టి20 చాలెంజర్స్ పై కూడా నిర్ణయం తీసుకున్నారు. లక్నో వేదికగా మే 24 నుంచి 28 మధ్య మూడు జట్లతో మహిళల టి20 చాలెంజర్స్ టోర్నీ జరగనుంది.