ఐపీఎల్ 2021.. రోహిత్ వర్సెస్ కోహ్లీ.. గెలుపెవరిదో..?
IPL 2021 MI vs RCB Match Prediction. ఐపీఎల్ 14వ సీజన్‌కు తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 9 April 2021 3:14 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్‌కు నేటి నుంచి తెరలేవనుంది. తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. అటు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబైకి కెప్టెన్ కాగా.. ఇటు విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్. ఇక ఈ ఇద్దరూ టీమ్ఇండియాలో ముఖ్యమైన ఆటగాళ్లు కావడంతో ఈమ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు జరుగగా.. 17 మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. అయినప్పటికి కోహ్లీ సేనను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
మొత్తం బ్యాట్స్‌మెన్లే.. ఒక్కరు నిలిచినా..
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు కప్పు గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. 5 సార్లు ఆ జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌లోనూ గెలిచి వరుసగా మూడు సార్లు కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించాలని ఆ జట్టు భావిస్తోంది. ముంబై జట్టుకు అతి పెద్ద బలం కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో సందేహాం లేదు. ముంబై కప్పు గెలిచిన 5 సార్లు రోహిత్ కెప్టెన్సీలోనే కావడం విశేషం. హిట్ మ్యాన్ ఎలాంటి బౌలింగ్‌నైనా చిత్తుచేయగలడు. ఇక ఈ జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవ లేదు. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఇషాన్ కిషన్, హార్థిక్ సోదరులు, సూర్య కుమార్, పొలార్డ్ వంటి ఆటగాళ్లు ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో అందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరందరూ ఫామ్‌లో ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశం. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా.. బెంగళూరు ముందు భారీ స్కోరు తప్పదు. ఇక బౌలింగ్‌లోనూ ముంబైకి తిరుగులేదు. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ ,కౌంటర్ నైల్ తో కూడిన పేస్ దశం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించడం ఖాయం. కాగా.. వివాహం కారణం కొద్ది రోజులు విరామం తీసుకున్న బుమ్రా.. ఐపీఎల్‌తో పునరాగమనం చేయనున్నాడు.
మొత్తం భారం ఆ ఇద్దరి పైనే..?
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టలేదు. ప్రతిసారి కప్పు మనదే అనే నినాదంతో రావడంతో ఊసూరు మనిపించడం బెంగళూరుకు అలవాటుగా మారింది. అయితే.. గతంలో చేసిన తప్పులను చేయమంటూ.. ఈ సారి ఖచ్చితంగా కప్పు గెలుస్తామంటూ అభిమానులకు హామీ ఇచ్చింది. కోహ్లీ, డివిలియర్స్ ఇద్దరు ఔటైతే.. ఆ జట్టు సైకిల్ స్టాండ్‌ను తలపిస్తోంది. అందుకనే ఈ సారి ఏరీ కోరీ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వేలంలో భారీ మొత్తానికి దక్కించుకుంది. గత సీజన్‌లో పంజాబ్ తరుపున ఆడిన మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరిచాడు. అన్ని మ్యాచ్‌లు ఆడిన కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. మరీ జట్టును మారిన మ్యాక్సీ ఆటతీరు మారుతుందో లేదో చూడాలి.
గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్.. కరోనా కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరంకానుండడం బెంగళూరు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. కోహ్లీ, డివిలియర్స్ రాణించడం పైనే బెంగళూరు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ వీరు తప్పించి పెద్దగా పేరున్న ఆటగాళ్లు లేరు. అయితే.. బౌలింగ్‌లో మాత్రం బెంగళూరు బలంగానే ఉంది. నవదీప్ సైనీ, సిరాజ్, కేన్ రిచర్డ్ సన్, వాషింగ్టన్ సుందర్ లతో కూడిన బౌలింగ్ విభాగం.. ముంబై బ్యాట్స్ మెన్లను ఎంతమేరకు నిలరిస్తుందో చూడాలీ.