మ‌రోసారి జాక్‌పాట్ కొట్టిన మాక్స్‌వెల్‌.. త‌క్కువ‌కే అమ్ముడైన స్మిత్

IPL 2021 auction RCB sign Glenn Maxwell for inr 14.25 crores.ఆల్‌రౌండ‌ర్ గ్లెన్‌మ్యాక్స్‌వెల్‌కు ఏ మాత్రం డిమాండ్ త‌గ్గ‌లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2021 10:50 AM GMT
IPL 2021 auction RCB sign Glenn Maxwell for inr 14.25 crores

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో గ‌త కొన్ని సీజ‌న్లుగా విఫ‌లం అవుతున్న‌ప్ప‌టికి ఆల్‌రౌండ‌ర్ గ్లెన్‌మ్యాక్స్‌వెల్‌కు ఏ మాత్రం డిమాండ్ త‌గ్గ‌లేదు. గ‌త‌సీజ‌న్‌లో ప‌ది కోట్లకు పంజాబ్ అత‌డిని కొనుగోలు చేయ‌గా.. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన 13వ సీజ‌న్లో మాక్సీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఒక్క‌టంటే ఒక్క సిక్స్ కూడా కొట్ట‌లేక‌పోయాడు. దీంతో పంజాబ్ అత‌డిని వ‌దిలివేసింది. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన మాక్స్‌వెల్ కోసం చెన్నై, ఆర్‌సీబీ పోటీప‌డ్డాయి.


చెన్నై వ‌ద్ద త‌క్కువ మొత్తమే ఉండ‌డంతో.. రూ.14 కోట్ల వ‌ర‌కు ప్ర‌య‌త్నించి వ‌దిలివేయ‌గా.. ఆర్‌సీబీ మ‌రో 25 ల‌క్ష‌లు జోడించి రూ.14.25కోట్ల‌కు ద‌క్కించుకుంది. దీంతో ఈ ఆస్ట్రేలియా ఆట‌గాడు మ‌రోసారి జాక్‌పాట్ కొట్టేశాడు. మ‌రో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతి త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయాడు. వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన స్మిత్ కోసం ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. మొద‌ట‌గా బేస్‌ప్రైస్ ద‌గ్గ‌ర బెంగ‌ళూరు బిడ్ మొద‌లుపెట్టింది. ఆ వెంట‌నే ఢిల్లీ క్యాపిట‌ల్స్ 2.2 కోట్ల‌కు బిడ్ వేసింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ ముందుకు వెళ్ల‌లేదు. దీంతో స్మిత్‌ను 2.2 కోట్లకు క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.


మ‌రోవైపు బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హ‌స‌న్‌ను రూ.3.2 కోట్లు పెట్టి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో అత‌ను వేలంలోకి వ‌చ్చాడు. అత‌ని కోసం కింగ్స్ పంజాబ్ కూడా తీవ్రంగానే ప్ర‌య‌త్నించింది. చివ‌రికి కోల్‌క‌తా అత‌న్ని ద‌క్కించుకుంది. తొలి రౌండ్‌లో ఆరోన్ ఫిచ్‌, అలెక్స్ హేల్స్‌, హ‌నుమ విహారి, జేస‌న్ రాయ్‌లాంటి స్టార్ ఆట‌గాళ్లు ఎవ‌రినీ ఫ్రాంచైజీలు తీసుకోలేదు.
Next Story