విజయానందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..

Injured Warner ruled out. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియాకు టీ20 సిరీస్ ముంగిట గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

By Medi Samrat  Published on  30 Nov 2020 5:40 AM GMT
విజయానందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..

వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియాకు టీ20 సిరీస్ ముంగిట గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఆ జ‌ట్టు విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ గాయ‌ప‌డ్డాడు. దీంతో మూడో వ‌న్డే మ్యాచ్‌తో పాటు టీ20 సిరీస్‌కు దూరమ‌య్యాడు. సిడ్ని వేదిక‌గా ఆదివారం భారత్‌తో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. తీవ్ర నొప్పితో విలవిలాడిన ఈ ఆసీస్ స్టార్ ఓపెనర్ వెంటనే మైదానం వీడాడు.

భార‌త జ‌ట్టు చేద‌న సంద‌ర్భంగా .. నాలుగో ఓవర్లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడిన షాట్‌ను ఆపబోయిన డేవిడ్ వార్నర్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో తొడ కండరాలు పట్టేయడంతో కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో విలవిలలాడిన ఈ ఆసీస్ ఓపెనర్.. తిరిగి పైకి లేవడానికి ఇబ్బంది పడ్డాడు. చివరకు ఫిజియో, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సాయంతో కుంటుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్స్‌రే తీయించడం కోసం వార్నర్‌ను కార్‌లో స్టేడియం నుంచి హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. వాహనం ఎక్కడానికి వెళ్తున్నప్పుడు కూడా వార్నర్ కుంటుతూనే నడిచాడు.

వార్నర్‌కు గజ్జ గాయం(గ్రోయిన్ ఇంజ్యూరీ) అయిందని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రతినిధి మీడియాకు తెలిపారు. గ్రోయిన్ స్ట్రెయిన్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కామెంటేటర్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కనీసం 6 వారాల సమయం పడుతుందన్నాడు. దాంతో వార్నర్ మూడో వ‌న్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరంకానున్నాడు.

తొలి వన్డేలో 76 బంతుల్లో 68 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. రెండో వన్డేలో 77 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మరో ఓపెనర్ అరోన్ ఫించ్‌తో కలిసి తొలి వికెట్‌కి 156, 142 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా భారీ స్కోర్లకి బాటలుపరిచాడు. వార్న‌ర్ దూరం కావ‌డం.. ఆసీస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.




Next Story