హ‌ర్మ‌న్ విధ్వంసం.. ఇంగ్లాండ్ గడ్డపై భారత అమ్మాయిల నయా చరిత్ర

Indian Women beat England by 88 Runs and clinch the Series.ఇంగ్లాండ్ గ‌డ్డ మీద భార‌త మ‌హిళా క్రికెటర్లు అద్భుతం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 9:32 AM GMT
హ‌ర్మ‌న్ విధ్వంసం.. ఇంగ్లాండ్ గడ్డపై భారత అమ్మాయిల నయా చరిత్ర

ఇంగ్లాండ్ గ‌డ్డ మీద భార‌త మ‌హిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. వ‌రుస‌గా రెండో మ్యాచ్ గెలిచిన భార‌త జ‌ట్టు మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే మూడు వ‌న్డేల సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. 1999 త‌రువాత ఇంగ్లాండ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుకు ఇదే తొలి సిరీస్ విజ‌యం.

తొలుత బ్యాటింగ్ లో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (143 నాటౌట్; 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడ‌డంతో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 333 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం బౌలింగ్‌లో రేణుకా సింగ్ (4/57) స్వింగ్‌కు ఇంగ్లాండ్ కుదేలైంది. 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో 88 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. 12 ప‌రుగుల వ‌ద్ద ష‌పాలీ(8) వ‌ద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగింది. జ‌ట్టు స్కోరు 99 ప‌రుగుల‌కు చేరే స‌రికి మూడు వికెట్లు ప‌డ్డాయి. 35 ఓవ‌ర్ల‌కు జ‌ట్టు స్కోరు 176/3 గా ఉంది. ఈ స‌మ‌యంలో భార‌త్ 300 ప‌రుగులు చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఓ 270 ప‌రుగులు చేస్తుంద‌ని భావించారు. ఈ ద‌శ‌లో ప‌దునైన ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించింది.

శ‌త‌కం త‌రువాత హ‌ర్మ‌న్ మ‌రింత రెచ్చిపోయింది. తాను ఆడిన చివరి 11 బంతుల్లో ఆమె వరుసగా.. 6, 4, 4, 6, 4, 1, 6, 4, 4, 4, 0 తో రెచ్చిపోయిడంటే హ‌ర్మన్ ఎలాంటి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడిందో అర్థ‌మైపోతుంది. హ‌ర్మ‌న్ ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ముందు భార‌త్ భారీ స్కోరును ఉంచింది.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని చేదించ‌డానికి బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు రేణుకా సింగ్ చుక్కలు చూపెట్టింది. ఓపెనర్ ట్యామీ బ్యూమంట్ (6) రనౌట్ కాగా ఎమ్మా లంబా (15), వన్ డౌన్ బ్యాటర్ సోఫియా డంక్లీ (1) ని రేణుకా పెవిలియన్ కు చేర్చింది. ఆ తర్వాత వచ్చిన అలిస్ క్యాప్సే (39), వ్యాట్ (65), కెప్టెన్ అమీ జోన్స్ (39) కాసేపు ప్రతిఘటించారు. అయితే వ్యాట్‌ను రేణుకా బౌల్డ్ చేయగా.. అమీ జోన్స్‌ను హేమలత పెవిలియన్ పంపడంతో విజ‌యం ఇంగ్లాండ్ ఆశ‌లు వ‌దులుకుంది. ఆఖ‌రికి 44.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు వన్డేలలో భాగంగా ఆఖరి మ్యాచ్ ఈ నెల 24న లార్డ్స్‌లో జరుగుతుంది.

కాగా.. భారత సీనియ‌ర్ పేసర్ జులన్ గోస్వామికి ఇదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఈ సిరీస్ త‌రువాత ఆట‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు జులన్ గోస్వామి ఇంత‌క‌ముందే చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it