కోహ్లీ లేక‌పోవ‌డం మంచిదే.. అత‌డు ఆడ‌ని ప్ర‌తి మ్యాచ్ గెలిచింది : గ‌వాస్క‌ర్‌

Indian players tend to raise their game in Virat Kohli’s absence. న‌వంబ‌ర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా సుదీర్ఘ

By Medi Samrat  Published on  22 Nov 2020 3:38 AM GMT
కోహ్లీ లేక‌పోవ‌డం మంచిదే.. అత‌డు ఆడ‌ని ప్ర‌తి మ్యాచ్ గెలిచింది : గ‌వాస్క‌ర్‌

న‌వంబ‌ర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా సుదీర్ఘ సిరీస్ ప్రారంభమ‌వుతోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడ‌నుంది. డిసెంబ‌ర్ 17 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండ‌గా.. తొలి మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీ భార‌త్‌కు వ‌చ్చేయ‌నున్నాడు. జనవరిలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని విరాట్ ఆశిస్తున్నాడు. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవుల్ని కేటాయించింది. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని కొంద‌రు మాజీలు అంటుండ‌గా.. కోహ్లీ లేక‌పోవ‌డం కూడా భార‌త్‌కు మంచిదేన‌ని అన్నాడు దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్‌.

తాజాగా ఓ జాతీయ ప‌త్రిక‌తో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని చెప్పాడు. మనం ఓసారి గణాంకాలను పరిశీలిస్తే.. విరాట్‌ కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, అఫ్గానిస్థాన్‌ మీద ఒక టెస్టు.. నిదహాస్‌ ట్రోఫీ, 2018 ఆసియా కప్‌ ఇలా ఎప్పుడు చూసినా.. కోహ్లీ లేని మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా గెలుపొందింది. కోహ్లీ లేనప్పుడు ఇతర ఆటగాళ్లు బాగా ఆడడానికి ప్రయత్నిస్తారు. అతడు లేని లోటును భర్తీ చేయాలని అర్థం చేసుకుంటారు. అందుకే టీమిండియా రాణిస్తోంది' అని వివరించాడు.

కోహ్లీ గైర్హాజరీతో ర‌హానె, పుజారాకు కష్టమవుతుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. వాళ్లిద్దరూ బ్యాట్‌తో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యత రహానెకు ఉపయోగ పడుతుందని కూడా చెప్పాడు. కోహ్లీ లేనప్పుడు జట్టును ఎవరు నడిపించాలనే విషయంపై సెలెక్షన్‌ కమిటీ స్పష్టతతో ఉందని గవాస్కర్ పేర్కొన్నాడు.


Next Story