జింబాబ్వేలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ మూడు వన్డేల సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లు పునరాగమనం చేయగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్థిక్, పంత్ లకు విశ్రాంతి నిచ్చారు.
ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి.. తొలిసారి వన్డే జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి ఇంకా కోలుకోక పోవడంతో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయలేదు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో ఎప్పటిలాగే ధావన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్ష్‌దీప్‌లను కూడా ఈ టూర్‌కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు.
భారత జట్టు: ధావన్ (కెప్టెన్), రుతురాజ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్