తొలి వన్డేలో భారత్ విజయం.. రాణించిన రాహుల్, జడేజా
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
By తోట వంశీ కుమార్ Published on 18 March 2023 7:45 AM ISTవికెట్ల మధ్య పరుగు తీస్తున్న జడేజా, రాహుల్
మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. టెస్టుల్లో పేలవ ఫామ్‌తో ఆఖరి రెండు టెస్టుల్లో స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్.. వన్డేల్లో తానెంత విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు. జడేజాతో కలిసి అతడు జట్టును విజయతీరాలకు చేర్చాడు.
189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ అవలీలగా చేధిస్తుందని అంతా బావించారు. అయితే.. ఆదిలో భారత్‌కు గట్టి షాకులు తగిలాయి. కంగారూ పేసర్లు స్టార్క్, స్టాయినిస్ లు భారత బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్టాయినిస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్(3)ను ఔట్ చేయగా అయిదో ఓవర్‌లో వరుస బంతుల్లో కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్(0)లను స్టార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. శుభ్‌మన్ గిల్(20) కూడా ఔట్ కావడంతో భారత్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది.
అప్పుడొచ్చాడు కేఎల్ రాహుల్ (75 నాటౌట్; 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా(25)తో కలిసి ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(45 నాటౌట్; 69 బంతుల్లో 5 ఫోర్లు) తో కలిసి అభేధ్యమైన ఆరో వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఆల్‌రౌండర్‌గా తాను ఎంత విలువైన ఆటగాడినో జడేజా మరోసారి నిరూపించాడు. భారత్ లక్ష్యాన్ని 39.5 ఓవర్లలోనే అందుకుంది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్(81; 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా జడేజా రెండు, హార్థిక్, కుల్‌దీప్ చెరో వికెట్ తీశారు.