పాకిస్తాన్‌తో టీమ్ఇండియా పోరు నేడే.. అమ్మాయిలు అదరగొట్టాల్సిందే
India Women will take on Pakistan today in CWG 2022.కామన్వెల్త్ క్రీడల్లో 24 ఏళ్ల తర్వాత క్రికెట్‌ను ప్రశేశపెట్టారు.
By తోట వంశీ కుమార్ Published on 31 July 2022 9:20 AM GMTకామన్వెల్త్ క్రీడల్లో 24 ఏళ్ల తర్వాత క్రికెట్‌ను ప్రశేశపెట్టారు. స్వర్ణ పతకమే లక్ష్యంగా ఈ గేమ్స్‌లో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. ఆసీస్ చేతితో 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే.. నేడు దాయాది పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని భారత్ గట్టి పట్టుదలగా ఉంది. అటు పాకిస్థాన్ ఉమెన్స్ సైతం తన తొలి మ్యాచ్‌లో బార్బడోస్‌పై ఓడిపోయింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. అందుకనే విజయం సాధించేందుకు రెండు జట్లు కూడా హోరాహోరిగా తలపడనున్నాయి.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ మైదానంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఆసీస్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్, ఓపెనర్ షపాలీ వర్మ లు మాత్రమే రాణించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. నేటి కీలక మ్యాచ్‌లో వీరిద్దరితో పాటు మరో ఓపెనర్ స్మృతి మంధాన, బాటియా, రోడ్రిక్స్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు కూడా రాణిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు.
బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో టీమ్ఇండియా కాస్త ఫర్వాలేదు. తొలి మ్యాచ్‌లో రేణుకా సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. మరోసారి వీరిద్దరూ రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. వీరితో పాటు మేఘాసింగ్, రాధా యాదవ్ కూడా ఓ చేయి వేస్తే పాక్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేయొచ్చు. ఏదీ ఏమైనప్పటికీ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే.