విజ‌యంతో వీడ్కోలు ప‌లికిన జుల‌న్‌.. ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భార‌త్‌

India Women whitewash England at Lord's.జుల‌న్ గోస్వామి విజ‌యంతో త‌న సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sept 2022 8:50 AM IST
విజ‌యంతో వీడ్కోలు ప‌లికిన జుల‌న్‌.. ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భార‌త్‌

భార‌త క్రికెట్ దిగ్గ‌జం జుల‌న్ గోస్వామి విజ‌యంతో త‌న సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖ‌రి వన్డేలోనూ విజయం సాధించిన భారత అమ్మాయిలు 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశారు. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ పోరులో 16 ప‌రుగుల తేడాతో హ‌ర్మ‌న్ ప్రీత్ సేన విజ‌యం సాధించింది.

మ్యాచ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బావోద్వేగ‌మే. టాస్ ద‌గ్గ‌ర నుంచి మ్యాచ్ ముగిసే వ‌ర‌కు అంద‌రి క‌ళ్లూ జుల‌న్ గోస్వామి వైపే ఉన్నాయి. ఆమె ఎటు వెళితే కెమెరా అటువైపే.. మొత్తంగా ఈ వెట‌ర‌న్ పేస‌ర్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని బ‌హుమ‌తిగా అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 45.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శ‌ర్మ‌(68 నాటౌట్; 106 బంతుల్లో 7పోర్లు), స్మృతి మంధాన‌(50; 79 బంతుల్లో 5 పోర్లు) జ‌ట్టును ఆదుకున్నారు.

170 పరుగుల విజయ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్.. భార‌త బౌల‌ర్ రేణుక సింగ్ (4/29) ధాటికి 43.3 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 118 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచున నిలిచింది ఇంగ్లాండ్‌. అయితే.. ఆఖ‌రి వికెట్ తీసేందుకు భార‌త బౌలర్లు చాలా శ్ర‌మించారు. ఆఖ‌రి వ‌రుస బ్యాట‌ర్ల‌తో క‌లిసి ఛార్జీ డీన్‌(47) త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌డుతూ మ్యాచ్‌ను భార‌త్ నుంచి లాగేసుకునేలా క‌నిపించింది. 17 ప‌రుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంద‌న‌గా.. డీన్‌ను దీప్తిశ‌ర్మ ర‌నౌట్‌(మ‌న్క‌డింగ్‌) చేసి భార‌త్‌ను గెలిపించింది.

దీప్తి బంతి వేయ‌క‌ముందే నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న‌ డీన్ క్రీజు వ‌దిలి ముందుకు వెళ్లింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన దీప్తి బౌలింగ్ చేస్తున్న‌ట్లుగానే ముందు వెళ్లి ఆమెను ర‌నౌట్ చేసింది. త‌న ఆఖ‌రి మ్యాచ్‌లో జుల‌న్ గోస్వామి 10 ఓవ‌ర్లు వేసి 30 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. మూడు మెయిడెన్లు ఓవ‌ర్లు వేయ‌డం విశేషం. మ్యాచ్ అనంత‌రం జుల‌న్ గోస్వామిని త‌మ భుజాల‌పైకి ఎక్కించుకుని లార్డ్స్ మైదానం మొత్తం తిప్పారు భారత అమ్మాయిలు.

2002లో ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జుల‌న్‌.. టీమ్‌ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజ‌యాల‌ను అందించింది. సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరపున 12 టెస్టు మ్యాచ్‌ల్లో 44 వికెట్లు, 203 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. 68 టీ20 మ్యాచుల్లో 56 వికెట్లు తీసింది. వ‌న్డేల్లో బ్యాటింగ్‌లో 1228 పరుగులు కూడా చేసింది.

Next Story