టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌.. షాకిచ్చిన ఇంగ్లాండ్‌

India win the toss and choose to bat first.చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2021 4:26 AM GMT
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌.. షాకిచ్చిన ఇంగ్లాండ్‌

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఆదిలోనే ఇంగ్లాండ్ బౌల‌ర్లు భార‌త్‌కు షాకిచ్చారు. స్కోర్ బోర్డుపై ఒక్క ప‌రుగులు కూడా చేర‌కుండానే భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవ‌ర్ మూడో బంతికి ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ను స్టోన్ ఎల్బీగా పెవిలియ‌న్ చేర్చాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్ ఆరంభంలోనే ఔట్ కావ‌డం భార‌త్‌కు ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం భార‌త్ స్కోర్ 16/1. రోహిత్ శ‌ర్మ12ప‌రుగుల‌తో, పుజారా 4 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

తొలి టెస్టులో ఘోర పరాజయం దృష్ట్యా టీమ్ఇండియా ఈ టెస్టులో కీలక మార్పులతో బరిలోకి దిగింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి.. అతని స్థానంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అవకాశం ఇచ్చారు. అలాగే వాషింగ్టన్ సుందర్‌ను పక్కన బెట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన షాబాజ్ నదీం స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారా అక్షర్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తుండడం విశేషం. సుమారు రెండేళ్ల విరామం అనంతరం టెస్టుల్లోకి కుల్దీప్‌ యాదవ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

అలాగే ఇంగ్లాండ్‌ సైతం నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. అండర్సన్‌, బట్లర్‌, ఆర్చర్‌, బెస్‌కు విశ్రాంతి ఇవ్వగా.. బ్రాడ్‌, ఫోక్స్‌, స్టోన్‌, మొయిల్‌ అలీని తుదిజట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి ఇచ్చారు. తొలిటెస్టును ప్రేక్షకులు లేకుండానే నిర్వహించగా.. రెండో టెస్టుకు 50శాతం మంది వీక్షకులకు అవకాశం ఇచ్చారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్‌ జట్టు: రోరే బర్న్స్, డోమ్ సిబ్లీ, డాన్ లారెన్స్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, ఒల్లీ స్టోన్, జాక్ లీచ్


Next Story