టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. 3-1తో సిరీస్ కైవ‌సం.. టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్‌కు

India win the fourth test and enter into WTC final.అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఇన్సింగ్స్ 25 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2021 10:54 AM GMT
India win the fourth test and enter into the WTC final

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఇన్సింగ్స్ 25 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 160 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జ‌ట్టు 135 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. లారెన్స్(50)‌ను అశ్విన్ బౌల్డ్ చేయ‌డంతో భార‌త్‌ను విజ‌యం వ‌రించింది. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్, అక్ష‌ర్ ప‌టేల్ చెరో 5 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 265 ప‌రుగులు చేయ‌గా.. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 365 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమ్ఇండియా 3-1తో కైవ‌సం చేసుకుంది. దీంతో ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

ఆడుకున్న సుంద‌ర్‌, అక్ష‌ర్‌..

294/7 స్కోర్‌తో మూడో రోజు ఆట కొన‌సాగించిన భార‌త్ మ‌రో 71 ప‌రుగులు జోడించి మిగ‌తా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవ‌ర్‌నైట్ బ్యాట్స్‌మెన్లు వాషింగ్ట‌న్ సుంద‌ర్(96 నాటౌట్ 118 బంతుల్లో 13 పోర్లు‌,2 సిక్స‌ర్లు), అక్ష‌ర్ ప‌టేల్(43 97 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్స్‌) లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్ద‌రూ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఎడాపెడా బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 106 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఓ వైపు సుంద‌ర్ శ‌త‌కానికి నాలుగు ప‌రుగుల దూరంలో ఉండ‌గా.. అక్ష‌ర్ కూడా అర్థ‌శ‌త‌కానికి చేర‌వ‌య్యాడు. ఈ ద‌శ‌లో అక్ష‌ర్ ప‌టేల్ ర‌నౌట్ అయ్యాడు.

రూట్ వేసిన 113వ ఓవ‌ర్ చివ‌రి బంతిని సుంద‌ర్ షాట్ ఆడ‌గా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అక్ష‌ర్ ప‌రుగు తీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. సుంద‌ర్ నో చెప్పాడు. దీంతో అక్ష‌ర్ తిరిగి క్రీజును చేరేలోపు బెయిర్ స్టో బంతిని అందుకుని రూట్‌కు అందించ‌గా.. రూట్ బెయిల్స్‌ను ప‌డ‌గొట్టాడు. దీంతో టీమ్ఇండియా 365 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాతి ఓవ‌ర్ వేసిన స్టోక్స్ ఇషాంత్‌, సిరాజ్‌ల‌ను బంతుల వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్ చేర్చ‌డంతో భార‌త ఇన్నింగ్స్‌కు ముగిసింది. దీంతో సుంద‌ర్ శ‌త‌కాన్ని అందుకోలేక‌పోయాడు. శుక్ర‌వారం రిష‌బ్‌పంత్ శ‌త‌కం(101) సాధించిన సంగ‌తి తెలిసిందే.

160 ప‌రుగుల లోటుతో..

160 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ కు భార‌త స్పిన్న‌ర్లు షాకిచ్చారు. జాక్ క్రాలే(5), బెయిర్ స్టో (0) ను అశ్విన్‌.. బెన్‌స్టోక్స్‌(2), సిబ్లి(3) ల‌ను అక్ష‌ర్ పెవిలియ‌న్ పంపారు. దీంతో 30 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ధ‌శ‌లో కెప్టెన్ జో రూట్ (30), ఒలి పోప్‌(15)లు జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 35 ప‌రుగులు జోడించారు. జో రూట్‌ను అశ్విన్‌, ఒలిపోప్‌ల‌ను అక్ష‌ర్ వ‌రుస ఓవ‌ర్ల‌లో పెవిలియ‌న్ చేర్చారు. దీంతో ఇంగ్లాండ్ 65 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఓట‌మి ఖాయ‌మైంది. ఈ ద‌శ‌లో లారెన్స్‌(50) భార‌త విజ‌యాన్ని కాస్త ఆల‌స్యం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. ఓ ప‌క్క లారెన్స్ క్రీజులో పాతుకుపోయి అడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు బాదాడు. మ‌రో ఎండ్‌లో ఉన్న బెన్ ఫోక్స్‌(13), బెస్‌(2), జాక్ లీచ్‌(2) ఇలా వ‌చ్చి అలా వెళ్లారు. చివ‌రికి లారెన్స్‌ను అశ్విన్ బౌల్డ్ చేయ‌డంతో భార‌త విజ‌యం ఖాయ‌మైంది.


టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్‌కు

ఈ విజ‌యంతో భార‌త్ ఐసీసీ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్‌కు చేరింది. 72.2 శాతం విజ‌యాలు 520 పాయింట్లతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. 70శాతం విజ‌యాలు 420 పాయింట్ల‌తో కివీస్ రెండో స్థానంలో ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ ఆడ‌నున్నాయి. జూన్ 18 నుంచి 22 వ‌ర‌కు లార్డ్స్ వేదిక‌గా ఇండియా, కివీస్ జ‌ట్లు పైన‌ల్‌లో త‌ల‌ప‌నున్నాయి. గెలిచిన జ‌ట్టుకు టెస్టు ఛాంఫియ‌న్ షిప్ గ‌ద ల‌భించ‌నుంది.





Next Story