క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. పరువు కోసం విండీస్ ఆరాటం
India vs West indies 3rd ODI today.మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది
By తోట వంశీ కుమార్ Published on 27 July 2022 2:51 PM ISTమరో మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమ్ఇండియా. నామ మాత్రమైన చివరి వన్డే నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ బావిస్తోండగా కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. సిరీస్ సొంతమైనప్పటికీ ఆఖరి మ్యాచ్‌లో భారత టీమ్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.
చాలా రోజుల తరువాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచుల్లో 64, 43 పరుగులతో రాణించాడు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ను తప్పించి రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకునే అవకాశం దాదాపుగా లేదు. సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్‌లు గత మ్యాచ్‌లో అర్థశతకాలు బాది ఫామ్‌లో ఉన్నారు. రెండు మ్యాచుల్లో విఫలం అయినప్పటికీ సూర్య కుమార్ యాదవ్ స్థానానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. దీంతో మరోమారు ఇషాన్ కిషన్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.
గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడో వన్డేలో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ పాత్రకు పూర్తి నాయ్యం చేశాడు. దీంతో చాహల్‌కు తోడుగా అక్షర్ కొనసాగనున్నాడు. అరంగ్రేట మ్యాచ్‌లో అవేష్ ఖాన్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే అవకాశం ఉంది.
ఓ వైపు భారత్ ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా విండీస్ పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది. వరుసగా ఎనిమిది వన్డేల్లో వెస్టిండీస్ జట్టు ఓడడం అందుకు ప్రధాన కారణం. ఇకనైనా ఓటములకు పుల్‌స్టాప్ పెట్టాలని ఆ జట్టు బావిస్తోంది. షై హోప్, నికోలస్ పూరన్, పావెల్, షెఫర్డ్ లాంటి ఆటగాళ్లు ఉన్నా పరిస్థితులకు తగ్గట్లు రాణించలేకపోతుండడం విండీస్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.