ఇక పొట్టి స‌మ‌రం.. విండీస్‌తో భార‌త్ తొలి టీ20 నేడే

India vs West Indies 1st T20I Match today in Eden Gardens.వ‌న్డే సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు టీ 20

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 3:05 PM IST
ఇక పొట్టి స‌మ‌రం.. విండీస్‌తో భార‌త్ తొలి టీ20 నేడే

వ‌న్డే సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు టీ 20 సిరీస్‌పై క‌న్నేసింది. పొట్టి ఫార్మాట్‌లోనూ త‌మ జైత్ర యాత్ర‌ను కొన‌సాగించాల‌ని బావిస్తోంది. నేడు(బుధ‌వారం) కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించి.. త‌ద్వారా టీ20 సిరీస్‌లో బోణి కొట్టాల‌ని భార‌త్ బావిస్తోండ‌గా.. త‌మ‌కు అచ్చొచ్చిన టీ20ల్లో స‌త్తా చాటాల‌ని వెస్టిండీస్ ఆరాట‌ప‌డుతోంది. క‌రోనా కార‌ణంగా మూడు టీ20లు ఇదే స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రో ఎనిమిది నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో.. క‌ప్ దిశ‌గా స‌రైన జ‌ట్టును సిద్దం చేసుకోవ‌డానికి ఇక్క‌డ్నుంచి ప్ర‌తి సిరీస్‌ను ఉప‌యోగించుకోవాల‌ని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లు బావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు యువ ఆటగాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో కోచ్ ద్రావిడ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఓపెన‌ర్ రాహుల్ గాయంతో ఈ సిరీస్‌కు దూర‌మైనా.. జ‌ట్టు ఎంపిక‌లో పెద్ద‌గా క‌ష్టాలు లేవు. ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో రోహిత్‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవ‌కాశం ఉంది. కోహ్లీ మూడులో వ‌స్తాడు. ఆ త‌రువాత పంత్, సూర్య‌కుమార్‌, శ్రేయాస్ రావొచ్చు. అయితే.. శ్రీలంక‌తో టీ20, టెస్టు సిరీస్ ఆడాల్సి ఉన్న నేప‌థ్యంలో పంత్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. పంత్ కు విశ్రాంతినిస్తే.. దీపక్‌ హుడా, వెంకటేశ్ ఇద్ద‌రికి చోటు ద‌క్కొచ్చు. ప్రయోగాలు అనే పెద్ద పదాలు వాడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ యువకులు నిలదొక్కుకునేందుకు తగినన్ని అవకాశాలిస్తామని స్పష్టం చేశాడు.

ఇక వ‌న్డేల్లో త‌మ‌కు ఎదురైన ఓట‌మికి ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని వెస్టిండీస్ బావిస్తోంది. తాజాగా జ‌రిపిన ఐపీఎల్ వేలం ఆజ‌ట్టు ఆట‌గాళ్లలో జోష్ నింపింది. కెప్టెన్ పొలార్డ్ గాయం కార‌ణం చివ‌రి రెండు వ‌న్డేలకు దూరం కాగా.. ప్ర‌స్తుతం పూర్తిగా కోలుకున్నారు. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. హెట్‌మ‌య‌ర్‌, కింగ్‌, పూరన్‌, పొలార్డ్‌, పావెల్‌, హోల్డర్‌, షెఫర్డ్, ఒడియ‌న్ స్మిత్ లాంటి ఆట‌గాళ్ల‌తో ఆ జ‌ట్టు బ్యాటింగ్ లోతు బాగానే క‌నిపిస్తోంది.

ఈడెన్ పిచ్ పేస‌ర్లు, స్పిన్న‌ర్ల‌కు స‌మానంగా అనుకూలిస్తోంది. పిచ్‌పై మంచి బౌన్స్ ఉంది. రాత్రి మంచు ప్ర‌భావం ఉంటుంది కాబ‌ట్టి మ్యాచ్ ముందుకు సాగేకొద్ది స్పిన్న‌ర్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. కాబ‌ట్టి టాస్ గెలిచిన జ‌ట్టు చేధ‌న‌కే మొగ్గు చూపించే అవ‌కాశం ఉంది.

Next Story