కొత్త ఏడాదిలో శుభారంభం చేసేనా..? శ్రీలంకతో టీ20 సిరీస్ నేటి నుంచే
India vs Sri lanka 1st t20 match today.టీ20 ప్రపంచకప్‌లలో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేసి అభిమానుల నుంచి తీవ్ర
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 5:29 AM GMT2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేసి అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చవి చూసింది. అటు కోహ్లీ, ఇటు రోహిత్ లు ఇద్దరు ప్రపంచ కప్‌లను గెలిపించలేకపోయారు. ఇక ఈ ఇద్దరూ దాదాపుగా టీ20 ఆడడం కష్టమే. 2024 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. హార్థిక్ పాండ్యకు పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులో కుర్రాళ్లకు పెద్ద పీట వేసింది. ఇప్పటి నుంచే లక్ష్యం దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్త ఏడాదిలో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. సొంతగడ్డపై లంకను ఢీ కొట్టబోతుంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు(మంగళవారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక వీరు ఈ ఫార్మాట్‌లో ఆడడం సందేహామే. కుర్రాళ్లకు పెద్ద పీట వేయాలని బావించిన బీసీసీఐ రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో చోటిచ్చారు. వీరు ఏ మేరకు రాణిస్తారు అన్నది చూడాల్సి ఉంది.
నూతన సంవత్సరంలో ఆడే తొలి సిరీస్ కావడంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలని టీమ్ఇండియా బావిస్తోంది. బంగ్లాదేశ్‌పై ద్విశతకం బాది మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా అతడికి జతగా శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరు ఓపెనర్‌గా రావొచ్చు. వన్‌డౌన్‌లో సూర్యకుమార్ రానున్నాడు. ఇషాన్ కిషన్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడుతుండగా, వికెట్ కీపింగ్ బాధ్యతలు సంజు శాంసన్ నిర్వర్తించే అవకాశం ఉంది. కొంతకాలంగా సంజుకి సరైన అవకాశాలు రావడం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడి అభిమానులు వాపోయిన సంగతి తెలిసిందే. మరీ సంజు ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.
అటు బ్యాటర్‌గా, ఇటు బౌలర్‌గానే కాకుండా కెప్టెన్‌గా హార్థిక్ జట్టును ముందు ఉండి నడిపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫినిషర్ పాత్రను హార్థిక్ పోషించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తుది జట్టులో చోటు ఖాయం. వాషింగ్టన్ సుందర్, చాహల్‌లు స్పిన్ బాధ్యతలు పంచుకోనే అవకాశం ఉంది.
జయవర్థనే, జయసూర్య, కుమార సంగక్కర వంటి దిగ్గజ ఆటగాళ్లు వీడ్కోలు పలికాక లంక జట్టు చాలా బలహీన పడింది. ఓ దశలో చిన్న జట్లను ఓడించేందుకు ఇబ్బంది పడింది. అయితే.. ధసున్ శనక సారథ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు క్రమంగా మెరుగుపడింది. శనక, ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నె, హసరంగ వంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం వీరితో పాటు నిశాంక, కుశాల్ మెండిస్‌లు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. మహేష్ తీక్షణ, లహిరు కుమార లాంటి బౌలర్లు నిలకడగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఆ జట్టు ఆట తీరుకు నిదర్శనం. ఈ మ్యాచ్‌లో పేవరేట్లు ఎవరో చెప్పడం కొంచెం కష్టం. అయితే.. సొంత గడ్డపై ఆడుతుండడం టీమ్ఇండియాకు కలిసివచ్చే అంశం. అయితే.. లంకను తేలిగ్గా తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు.