అరంగ్రేట ఛాంపియన్‌షిప్ గెలిచేందుకు కోహ్లీ, కేన్ తహతహ
India vs New zealand playing 11 match prediction.వన్డేలు, టీ20ల రాకతో సుధీర్ఘపార్మెట్ కళ తప్పింది. మూడు గంటలు,
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2021 1:01 PM GMTవన్డేలు, టీ20ల రాకతో సుధీర్ఘపార్మెట్ కళ తప్పింది. మూడు గంటలు, ఒక్క రోజులో ముగిసే వన్డేలు, టీ20లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు. దీంతో 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌ను కాపాడుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను ప్రవేశపెట్టింది. దాదాపు రెండు సంవత్సరాలు అన్ని జట్లు ప్రతి జట్టుతో మ్యాచ్‌లు ఆడగా.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన న్యూజిలాండ్, భారత్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. రేపటి (జూన్ 18) నుంచి సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ అభిమానులకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలి సారి నిర్వహిస్తున్న ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ట్రోఫిని దక్కించుకునేందుకు ఇటు విరాట్ సారథ్యంలోని భారత జట్టు.. అటు కేన్ విలియమ్ సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్లు తహతహలాడుతున్నాయి. మరీ సమవుజ్జీల పోరులో విజేతగా నిలిచేది ఎవరోనని సగటు అభిమాని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. కరోనా మహమ్మారి వేదిస్తున్నసమయంలో ఈ రెండు జట్లు బయో బుడుగ కష్టాల్లో పడుతూ ఫైనల్‌కు చేరుకున్నాయి. కనీసం మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కోహ్లీసేన, ఇంగ్లాండ్‌ను 1-0తో ఓడించిన విలియమ్ సన్ బృందం సమరానికి శంఖం పూరిస్తున్నాయి. కాగా.. ఈ చాంఫియన్ షిప్‌లో అన్ని జట్లను చిత్తు చేసిన టీమ్ఇండియా.. కివీస్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. అయితే.. మ్యాచ్ జరిగేది తటస్థ వేదికపై కావడంతో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.
2019 ప్రపంచ వన్డే కప్ పైనల్‌ను ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోరు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలుత మ్యాచ్ స్కోర్లు సమం కాగా.. ఆ తరువాత సూపర్ ఓవర్ స్కోర్లు కూడా సమం అయ్యాయి. బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో యావత్తు క్రీడా ప్రపంచం కివీస్ ఓటమికి కన్నీరు పెట్టుకుంది. ఈ టెస్టు చాంపియన్ కివీస్ గెలిస్తే బాధ కొంతైనా తీరుతుందని సగటు కివీస్ అభిమాని ఆశిస్తున్నాడు.
ఇక ఐసీసీ ప్రవేశపెట్టిన అన్నీ టోర్నీలను భారత జట్టు కైవసం చేసుకుంది. వన్డే,టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్ ట్రోఫి టైటిళ్లను సొంతం చేసుకుంది. మరోవైపు ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ దుమ్ములేపుతున్నాడు. ఓ వైపు పరుగులు సాధిస్తూ.. మరోవైపు కెప్టెన్‌గా విజయాలు అందుకుంటున్నాడు. ఈక్రమంలో భారత అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ గా ఎదిగాడు. అయితే.. వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫి టైటిళ్లను తృటిలో దూరమైన విరాట్.. ఈ ఛాంపియన్ షిప్‌ను అందుకోవాలని, ఐసీసీ గదను ముద్దాడాలన్న సంకల్పంగా ఉన్నాడు.
ఏ ముగ్గురు నిలదొక్కుకున్న..
న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైపోయింది. ఆ తర్వాత బిగ్ త్రీ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే వస్తారు. ఈ టాప్-5 బ్యాట్స్‌మన్‌లో ఏ ముగ్గురు చెలరేగిన భారత్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. వీరికి జతగా ఫించ్ హిట్టర్ రిషభ్ పంత్ తోడైతే పరుగుల వరద పారుతోంది. ఆ తర్వాత జడేజా, అశ్విన్ రూపంలో లోయరార్డర్ కూడా బలంగా ఉంది. అంచనాల మేరకు రాణిస్తే భారత్‌కు ఏ కష్టాలు ఉండవు. కానీ వీరంతా ఏమేరకు రాణిస్తారన్నదానిపై విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
పిచ్ నేపథ్యంలో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, అశ్విన్ తుది జట్టులో ఉండటం ఖాయం. ఇంగ్లిష్ కండీషన్స్ బట్టి చూస్తే పేసర్లు బుమ్రా, షమీ ఆటోమెటిక్ చాయిస్. ఈ ఇద్దరి వేరియేషన్స్ కూడా అద్భుతంగా పని చేస్తాయి. చాలా రోజుల నుంచి భారత బౌలింగ్ కాంబినేషన్లో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు థర్డ్ పేసర్ ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇషాంత్ శర్మ, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మధ్య ఈ ప్లేస్ కోసం పోటీ నెలకొంది. వేరియేషన్ కోసం సిరాజ్‌ను తీసుకోవాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా సిరాజ్ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఇంగ్లండ్‌లో ఎక్స్‌పీరియెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇషాంత్‌కే చాన్స్ ఎక్కువగా ఉంది.
అత్యుత్తమ వనరులు..
న్యూజిలాండ్‌కు అత్యుత్తమ వనరులున్నాయి. పైగా ఆ జట్టు విజయ ఉత్సాహంలో బరిలోకి దిగుతోంది. కొన్నేళ్లుగా న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్ఠంగా తయారైంది. విలియమ్సన్‌కు తోడు ప్రధాన బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుత జట్టులోనే అత్యంత అనుభవజ్ఞుడైన రాస్ టేలర్.. మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆ జట్టులోని మరో కీలక బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్. ఇన్నింగ్స్ ఆరంభంలో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసి సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఈ ఓపెనర్ సొంతం. కొత్త ఓపెనర్ కాన్వేతోనూ ప్రమాదమే. అతనితో పాటు నికోలస్, వాట్లింగ్, బ్లండెల్‌తో కూడిన ఆ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్, జెమీసన్ బ్యాటుతోనూ మెరుపులు మెరిపించగలరు.
బౌలింగ్‌లోనూ ఆజట్టుకు ఎదురులేదు. అగ్రశ్రేణి సీనియర్ పేస్ ద్వయం బౌల్ట్, సౌథీతో పాటు వాగ్నర్, జెమీసన్, హెన్రీ, గ్రాండ్‌హోమ్, స్పిన్నర్ అజాజ్ పటేల్ రూపంలో ఆ జట్టుకు గొప్ప బౌలింగ్ దళం ఉంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌల్ట్, సౌథీ ఇప్పటికీ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్‌నూ వీళ్లు కకావికలం చేయగలరు.
పొంచి ఉన్న వర్షం ముప్పు..
ఇక ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్‌సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. దాదాపుగా 80 శాతం వర్షం కురుస్తుందనే చూపిస్తున్నాయి. ఇది మ్యాచ్ ఫలితాన్ని శాసించవచ్చు. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 59 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 21 మ్యాచ్‌లు, న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.