అతిపెద్ద స్టేడియంలో గులాబీ బంతితో సమరానికి సిద్దం
India vs England 3rd test match preview.ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 11:07 AM ISTప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడేందుకు టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్లు సిద్దమయ్యాయి. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు దక్కించుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఈ టెస్టు ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డపై సత్తా చాటాలని టీమ్ఇండియా భావిస్తుండగా.. పింక్ బాల్‌తో కోహ్లీ సేనకు షాక్ ఇవ్వాలని ఇంగ్లీష్ జట్టు పట్టుదలగా ఉంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ సమం చేసింది. మరీ మూడో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
భారత్‌లోని ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే పచ్చిక ఎక్కువ కనిపిస్తున్న ఈ వికెట్‌పై భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ పిచ్ చెపాక్‌లో పెద్దగా ప్రభావం చూపని కుల్‌దీప్ యాదవ్‌పై వేటు తప్పదు. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రెండో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న బుమ్రా రావడం ఖాయం. దీంతో సిరాజ్ అతడి స్థానాన్ని త్యాగం చేయాల్సిందే. తొలి టెస్టులో ఆకట్టుకున్న అక్షర్ పటేల్.. సీనియర్ బౌలర్ అశ్విన్‌తో కలిసి స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. రెండో మ్యాచ్‌లో సత్తా చాటిన రోహిత్ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌నే జట్టు ఆశిస్తోంది. ఇప్పటి వరకు సత్తా చాటని కోహ్లీ ఈ మ్యాచ్‌లో శతకంతో రాణించాలని కోరుకుంటున్నారు. ఇక పుజరా, రహానేలతో పాటు పంత్ కూడా బ్యాట్ ఝళిపిస్తే భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్ట్ కావడం విశేషం.
రోటేషన్ పాలసీ, గాయాలతో దూరమైన బెయిర్ స్టో, అండర్సన్, ఆర్చర్, క్రాలీల చేరికతో ఇంగ్లాండ్ బలం రెట్టింపు అవుతుందనడంలో సందేహాం లేదు. గులాబీ బంతి స్వింగ్‌కు అనుకూలిస్తే.. అండర్సన్, ఆర్చర్‌లను ఎదుర్కొనడం భారత బ్యాట్స్‌మెన్లకు పెద్ద సవాల్. రొటేషన్ పాలసీ కారణంగా బ్రాడ్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు. స్పిన్నర్ లీచ్ ఆడనున్నాడు. రెండో స్పిన్నర్ ఆడించాలనుకుంటే బెస్‌కు ఆడించే అవకాశం ఉంది. లేదంటే.. వోక్స్‌ను మూడో పేసర్ గా తీసుకోవచ్చు. వోక్స్‌ను తీసుకుంటే.. అతడు బ్యాటింగ్‌లో కూడా రాణించే అవకాశం ఉండడంతో అతడిని తీసుకునేందుకే ఇంగ్లాండ్ జట్టు మొగ్గు చూపవచ్చు.
రెండు పింక్ బాల్ టెస్టులు..
ఇక ఆరంభం నుంచి పింక్ బంతితో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపని భారత జట్టు.. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించాక తొలిసారి బంగ్లాదేశ్‌తో గులాబీ టెస్టు ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భారీ జనసందోహం మధ్య జరిగిన ఆ మ్యాచ్ టీమ్‌ఇండియా జోరుతో పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా గులాబీ బంతితో మ్యాచ్ ఆడిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆ పరాజయాన్ని మరిపించేలా విజృంభించాలని టీమ్‌ఇండియా ఉత్సుకతతో ఉంది.
పిచ్..
మొతెరాలో పచ్చికతో కూడిన పిచ్ దర్శనమిస్తున్నది. కొత్తగా నిర్మించిన తర్వాత ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. కాగా.. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్నా.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు.