తొలి రోజు మ‌న‌దే.. రోహిత్ భారీ శ‌త‌కం.. భారీ స్కోర్ దిశ‌గా భార‌త్‌

India vs England 2nd Test Day 1 India 300/6 at Stumps.చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో తొలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2021 11:43 AM GMT
తొలి రోజు మ‌న‌దే.. రోహిత్ భారీ శ‌త‌కం.. భారీ స్కోర్ దిశ‌గా భార‌త్‌

చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో భార‌త జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ 33 ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 5 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌల‌ర్లలో మోయిన్ అలీ, జాక్ లీచ్ చోరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్టోన్‌, రూట్ చెరో వికెట్ తీశారు. భార‌త్ బాట్స్‌మెన్ల‌లో రోహిత్ శ‌ర్మ భారీ శ‌త‌కంతో( 161;231 బంతుల్లో 18 పోర్లు, 2 సిక్స‌ర్లు) స‌త్తా చాట‌గా.. అజింక్యా ర‌హానే అర్థ‌శ‌త‌కంతో( 67; 149 బంతుల్లో 9 పోర్లు) రాణించాడు.

క‌ఠిన ప‌రిస్థితుల్లో భారీ శ‌త‌కంతో స‌త్తా చాటిన రోహిత్‌

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ప‌రుగుల ఖాతాను తెర‌వ‌క‌ముందే ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ను రెండో ఓవ‌ర్ మూడో బంతికి ఒలీ స్టోన్ ఎల్బీగా పెవిలియ‌న్ చేర్చాడు. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ను హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు న‌యా వాల్ పుజారా(21) భుజాన వేసుకున్నారు. తొలుత వీరిద్ద‌రు వికెట్ కాపాడుకోవ‌డానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక క్రీజులో కుదురుకున్న అనంత‌రం హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 48 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. మ‌రోవైపు పుజారా క్రీజులో అస‌హ‌నంగా క‌నిపించాడు. బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు ప‌డ్డాడు. జాక్ లీ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టోక్స్ చేతికి చిక్కాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 85 ప‌రుగులు జోడించారు.


ఈ ద‌శలో ఆదుకుంటాడ‌ని భావించిన కెప్టెన్ కోహ్లీ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో బౌల్డ‌య్యాడు. దీంతో 86 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా వ‌న్డే త‌ర‌హాలో రోహిత్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అత‌డికి అజింక్యా ర‌హానే జ‌త క‌లిశాడు. ఈ క్ర‌మంలో రోహిత్ మోయిన్ అలీ బౌలింగ్‌లో రోహిత్ రెండు ప‌రుగులు తీసి 130 బంతుల్లో టెస్టుల్లో ఏడో శ‌త‌కాన్ని సాధించాడు. కాగా.. ఈ ఏడు శ‌త‌కాలు కూడా భార‌త్‌లోనే సాధించిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో వైపు ర‌హానే కూడా మంచి బంతుల‌ను గౌర‌విస్తూ చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. ఈ క్ర‌మంలో ర‌హానే కూడా అర్థ‌శ‌త‌కాన్ని అందుకోగా.. రోహిత్ 150 ప‌రుగుల‌ను మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ ఊపు చూస్తుంటే.. ద్విశ‌త‌కాన్ని అందుకునేలా క‌నిపించాడు. అయితే.. లీచ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్.. మొయిన్‌ అలీ చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు 162 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ వెంట‌నే స్పిన్న‌ర్ మోయిన్ అలీ బౌలింగ్ లో ర‌హానే బౌల్డ్ అయ్యాడు. దీంతో 249 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది.

ఈ ద‌శ‌లో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు అశ్విన్‌(13) జ‌త‌క‌లిసాడు. పంత్ త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేయ‌గా.. అశ్విన్ కూడా ధాటిగా ఆడేందుకు య‌త్నించి రూట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 284 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ ఔట్ కావ‌డంతో.. రిష‌బ్ పంత్ నెమ్మ‌దించాడు. ఆ త‌రువాత వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిసి పంత్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ తొలి రోజును ముగించాడు. ఇక రెండో రోజు పంత్ ఎలా బ్యాటింగ్ చేస్తాడ‌న్న ధాటిపైనే భార‌త్ స్కోర్ ఆధార‌ప‌డి ఉంది.

ఈ పిచ్ తొలి రోజే.. ఐదో రోజు పిచ్‌ల ప్ర‌వ‌ర్తిస్తుండ‌డంతో ముందు ముందు బ్యాటింగ్ చేయ‌డం మ‌రింత క‌ష్ట త‌రం కానుంది. కాబ‌ట్టి తొలి ఇన్సింగ్స్‌లో భార‌త్ ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ ప‌రుగులు చేయాలి.





Next Story