పాక్ క్రికెటర్లు వచ్చేస్తున్నారు..!
India to grant visas to Pakistan cricket players.తాజాగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పాక్ ఆటగాళ్లకు భారత్ అనుమతిని ఇచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 12:47 PM GMTఅక్టోబర్ నెలలో జరగబోయే టీ 20 ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు కూడా పాల్గొననుంది. పాక్ ఆటగాళ్లకు భారత్ వీసాలు మంజూరు చేయాల్సి ఉండగా.. గత కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది. భారత్, పాక్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు మంజూరు పై ఓ డౌట్ నెలకొని ఉండగా.. తాజాగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా భారత్ అనుమతిని ఇచ్చింది.
వీసాల మంజూరుపై తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహసాన్ మనీ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి తమకు ఈ హామీ ఇప్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ను కూడా కోరారు. బీసీసీఐతో ఐఐసీ ఇటీవలే సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్లో పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల మంజూరుపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించనట్లు ఐఐసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని బిసిసిఐ కార్యదర్శి జే షా ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్లో జరగబోయే టీ 20 ప్రపంచకప్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ పోటీల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు వీసాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. మ్యాచ్‌లు చూడటానికి వచ్చే పాకిస్థాన్ అభిమానులకు వీసాలు ఇవ్వడంపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు.
టీ20 ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమిస్తూ ఉండగా.. భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. పాకిస్థాన్ జట్టు భారత్ లో పర్యటించి కూడా చాలా సంవత్సరాలే అయింది.