జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. విజృంభించిన దీపక్, అక్షర్, ప్రసిద్ధ్
India thrash hosts by 10 wickets.జింబాబ్వే నుంచి కనీస ప్రతిఘటన కూడా లేదు. అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2022 2:40 AM GMTజింబాబ్వే నుంచి కనీస ప్రతిఘటన కూడా లేదు. అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమ్ఇండియా వన్డే సిరీస్‌లో ఘనంగా బోణి కొట్టింది. అత్యంత ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో అతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా చాలా కాలం తరువాత జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ కొత్త బంతితో బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేశాడు. పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి టాప్ లేపాడు. దీపక్ చాహర్‌తో పాటు అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణలు కూడా విజృంభించడంతో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ చకబ్వ(35), ఎంగరవ(34), ఎవాన్స్(33 నాటౌట్) లు మాత్రమే కాస్త పోరాడారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణ లు తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (81 నాటౌట్; 113 బంతుల్లో 9 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (82 నాటౌట్; 72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్) ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చారు.
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉండడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రాకుండా ఆ జంటనే కొనసాగించాడు. గత నాలుగు మ్యాచుల్లో మూడోసారి శతక భాగస్వామ్యం నెలకొల్పింది ఈ జంట. లక్ష్యం చిన్నదే కావడంతో శిఖర్, గిల్ తొందరపడలేదు. తొలి పది ఓవర్లను ఆచితూచి ఆడిన ఈ జంట తరువాత క్రమంగా జోరు పెంచారు. తమదైన శైలిలో షాట్లను ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జింబాబ్వే బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో భారత్ ఈజీగానే విజయం సాధించింది. దీపక్ చాహర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరగనుంది.
ఎక్కడ ఆపానో.. అక్కడి నుంచే మొదలు పెట్టా..
జట్టులో స్థానం సుస్థిరం అయ్యే సమయంలో గాయం కారణంగా దాదాపు ఆరు నెలలు క్రికెట్ దూరం అయ్యాడు దీపక్ చాహర్. తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో అదరగొట్టాడు. మ్యాచ్ అనంతరం దీపక్ మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం ఎక్కడ ఆపేశానో ఈ రోజు మళ్లీ అక్కడి నుంచే మొదలుపెట్టానని అన్నాడు. తొలి రెండు ఓవర్లు వేసేసరికే ఇది నా రోజు అని అర్థమైంది. వరుసగా ఏడు ఓవర్లు వేయడం నా ఫిట్‌నెస్‌కు నిదర్శనం. పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంది. దీంతో పుల్ లెంగ్త్‌లో బంతులు వేసి ఫలితం రాబట్టా. మధ్యలో బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను గందరగోళానికి గురి చేశానని అన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక అవుతానా లేదా అనే దాని గురించి ఆలోచించడం లేదని, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పాడు.