ఐర్లాండ్ ప‌సికూన కాదు.. ఆ మ్యాచ్‌లో టీమిండియాకు చెమ‌ట‌లు ప‌ట్టించింది..!

వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు బయల్దేరింది.

By Medi Samrat  Published on  16 Aug 2023 10:00 AM GMT
ఐర్లాండ్ ప‌సికూన కాదు.. ఆ మ్యాచ్‌లో టీమిండియాకు చెమ‌ట‌లు ప‌ట్టించింది..!

వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు బయల్దేరింది. ఈసారి జట్టుకు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. ఐర్లాండ్ పర్యటనకు యువ‌కుల‌తో వెళ్లిన‌ టీమిండియా తమ తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించ‌నుంది. ఐర్లాండ్ పర్యటన తర్వాత భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది.

ఐర్లాండ్‌తో భారత జట్టుకు ఇది మూడవ ద్వైపాక్షిక టీ20 సిరీస్. అంతకుముందు 2018, 2022లో ఐర్లాండ్‌తో భారత్ 2-2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఆడింది. 2018లో ఆతిథ్య దేశంతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2022లో టీమ్ ఇండియా ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సులువుగా గెలిచింది భార‌త జ‌ట్టు. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ గట్టిపోటీని ఇచ్చింది. రెండో టీ20లో భారత జట్టు 226 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దానికి సమాధానంగా ఐర్లాండ్ జట్టు 221 పరుగులు చేసి ఆలౌటైంది. ఒకానొక సమయంలో మ్యాచ్ ఐర్లాండ్ గెలుస్తుంద‌ని భావించారు. అయితే.. మళ్లీ పుంజుకుని మ్యాచ్ గెలిచింది టీమిండియా. ఈ నేప‌థ్యంలోనే ఐర్లాండ్‌ను ప‌సికూన అని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే బోల్తా ప‌డే అవ‌కాశం ఉంది.

2009 టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో భారత జట్టు మొదటి T20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టుపై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఐర్లాండ్ పై భారత జట్టు అజేయంగా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జ‌ట్టు ఈ రికార్డును కొనసాగించాలని, ఆతిథ్య జట్టుపై 3-0 క్లీన్ స్వీప్‌తో స్వదేశానికి తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.

Next Story