పంత్, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లాండ్ లక్ష్యం 330
India set 330-run target for England.మూడో వన్డేలో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు రాణించి ఇంగ్లాండ్ ముందు 330 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
By తోట వంశీ కుమార్ Published on 28 March 2021 5:41 PM IST
నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు రాణించి ఇంగ్లాండ్ ముందు 330 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. శిఖర్ ధావన్(67;56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పంత్(78; 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్ పాండ్య(64; 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) లు రాణించడంతో 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. అయితే.. రెండో వన్డేలో 337 పరుగుల లక్ష్యాన్ని కేవలం 43 ఓవర్లకే చేదించిన ఇంగ్లాండ్‌కు ఈ లక్ష్యం సరిపోతుందా అన్నదే చూడాలి మరీ.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. 37 పరుగులు చేసిన రోహిత్‌ను ఆదిల్ రషీద్ ఔట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించారు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో పాటు విరాట్ కోహ్లీ(7), రాహుల్(7)లను పెవిలియన్‌కు చేర్చారు. దీంతో భారత్ 157 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, హార్థిక్ పాండ్య లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను ఏ మాత్రం లెక్కచేయలేదు. ఇద్దరూ పోటి పడి పరుగుల వరద పారించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సామ్ కరణ్ విడదీశారు. 78 పరుగులు చేసిన పంత్‌ను పెవిలియన్ చేర్చాడు. పాండ్య-పంత్ జోడి ఐదో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆ తర్వాత హార్దిక్ వేగంగా ఆడి హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39వ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్‌లో హార్దిక్ అవుటైనా అప్పటికే జట్టు పటిష్ఠ స్కోరుకు చేరుకుంది. ఆఖర్లో కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకూర్(30) వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును 300 దాటించారు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కృనాల్ ఔటైన తర్వాత టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.