మ్యాచ్ గెలిచినా.. టీమ్ఇండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు

India register their lowest ever score in powerplays of T20Is.ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో భార‌త జ‌ట్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sept 2022 12:34 PM IST
మ్యాచ్ గెలిచినా.. టీమ్ఇండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు

తిరువ‌నంత‌పురం వేదికగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొట్టింది. 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై తొలుత అర్ష్‌దీప్‌సింగ్‌, దీపక్‌చాహర్‌ సఫారీల భరతం పట్ట‌గా.. అనంత‌రం బ్యాటింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, కేఎల్ రాహుల్ లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(25; 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌), వేన్ పార్నెల్(24; 37 బంతుల్లో ఫోర్, సిక్స్‌ ), కేశవ్ మహరాజ్(41; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ ) లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/24), హర్షల్ పటేల్(2/26) రెండేసి వికెట్లు తీసారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా 16.4 ఓవర్లలో 2వికెట్లకు 110 పరుగులు చేసి సునాయ‌స విజ‌యాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ (50; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (51 నాటౌట్; 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో ) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ప‌వ‌ర్ ప్లేలో చెత్త రికార్డు..

ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు గెలిచిన‌ప్ప‌టికి ఓ చెత్త రికార్డును న‌మోదు చేసింది. టీమ్ ఇండియా ప‌వ‌ర్ ప్లే(6 ఓవ‌ర్లు)లో వికెట్ న‌ష్టానికి 17 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ టీ20ల్లో భార‌త్‌కు ఇదే అత్య‌ల్ప ప‌వ‌ర్ ప్లే స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌క‌ముందు 2016 ఆసియాక‌ప్‌లో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 21 ప‌రుగులు చేసింది.

ఇక ఇరు జట్ల మధ్య అక్టోబ‌ర్‌ 2న గువాహటిలో రెండో టీ20 మ్యాచ్‌ జరుగనుంది.

Next Story