పాపం పుజ‌రా.. పంత్ మ‌ళ్లీ సెంచ‌రీ మిస్‌.. భార‌త్‌కు ఫాలోఆన్ గండం

India reach 257/6 at day3 stumps.తొలి టెస్టులో ఇంగ్లాండ్ ప‌ట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2021 12:19 PM GMT
India reach 257/6 at day3 stumps

తొలి టెస్టులో ఇంగ్లాండ్ ప‌ట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 33, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 8 ప‌రుగుల‌తో ఉన్నారు. కాగా.. ప్ర‌త్య‌ర్థి కంటే కోహ్లీ సేన ఇంకా 321 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 578 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన సంగ‌తి తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. 19 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌(6) ఆర్చ‌ర్ బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన పుజారా(73)తో క‌లిసి శుభ్‌మ‌న్ గిల్‌(29) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌య‌త్నించాడు. మ‌రోసారి విజృంభించిన ఆర్చ‌ర్.. మంచి ట‌చ్‌లో క‌నిపించిన గిల్‌ను ఔట్ చేశాడు. దీంతో భార‌త్ రెండు వికెట్ల న‌ష్టానికి 59 ప‌రుగుల‌తో లంచ్‌కు వెళ్లింది. రెండో సెష‌న్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే కోహ్లీ(11), అజింక్యా ర‌హానే (1) ఇద్ద‌రూ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్ చేరారు. దీంతో టీమ్ఇండియా 73 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో న‌యావాల్ పుజారాకు రిష‌బ్ పంత్‌(91; 88బంతుల్లో 9 పోర్లు, 5 సిక్స‌ర్లు) జ‌త‌క‌లిసాడు. పంత్ త‌న స‌హ‌జ‌శైలిలో ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పుజారా కూడా బ్యాట్‌కు ప‌ని చెప్పాడు. వీరిద్ద‌రు స్పిన్న‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బౌండ‌రీలు బాదారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ అర్థ‌శ‌త‌కాలు సాధించారు. దీంతో నాలుగు వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగుల‌తో టీ విరామానికి వెళ్లింది. ఆఖ‌రి సెష‌న్‌లో ఇద్ద‌రూ దూకుడు పెంచారు. ఐదో వికెట్‌కు 119 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన అనంత‌రం దుర‌దృష్ట‌వ‌శాత్తూ పుజారా ఔట్ అయ్యాడు. బెన్ బౌలింగ్‌లో పుజారా పుల్‌షాట్‌కు య‌త్నించ‌గా.. షార్ట్‌లెగ్‌లో ఉ్న‌న పోప్‌ భుజానికి బంతి త‌గిలి గాల్లోకి లేచింది. మిడ్ఆన్‌లో ఉన్న బ‌ర్న్స్ సులువుగా క్యాచ్ ప‌ట్టాడు. ఏ మాత్రం ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌కు పుజారా నిరాశ చెందాడు.

తర్వాత రిషభ్ పంత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. పుజారా ఔటైనా ధాటిగా ఆడిన పంత్.. సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు. డామ్ బెస్ బౌలింగ్‌లోనే క్రీజు బయటకు వచ్చి భారీ షాట్ ఆడబోయిన పంత్.. లీచ్‌కు చిక్కాడు. దాంతో నిరాశ‌గా పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌రువాత వ‌చ్చిన సుంద‌ర్‌, అశ్విన్‌లు మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో లీచ్ నాలుగు, ఆర్చ‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. భార‌త్ ఫాలోఆన్‌ను గండాన్ని దాటాలంటే మ‌రో 120 ప‌రుగులు చేయాలి.

అంత‌ముందు ఓవ‌ర్‌నైట్ స్కోర్ 555/8తో మూడో రోజు ఆట కొన‌సాగించిన ఇంగ్లాండ్ మ‌రో 23 ప‌రుగులు జోడించి చివ‌రి రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బుమ్రా.. బెస్‌(34)ను ఎల్బీగా పెవిలియ‌న్ చేర్చ‌గా.. అనంత‌రం వ‌చ్చిన అండ‌ర్స‌న్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ జో రూట్ 218, స్టోక్స్ 82, సిబ్లీ 87, బ‌ర్న్స్ 33, పోప్ 34, బ‌ట్ల‌ర్ 30 ప‌రుగుల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, అశ్విన్ చెరో మూడు తీయ‌గా.. న‌దీమ్‌, ఇషాంత్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.


Next Story