కాన్పూర్ టెస్ట్.. కష్టాల్లో భారత్
India reach 154/4 at Tea break.కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో
By తోట వంశీ కుమార్ Published on 25 Nov 2021 2:47 PM ISTకాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. టీ విరామానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ (17) తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(6) ఉన్నారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జేమీసన్ బౌలింగ్ కీపర్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(52; 93 బంతుల్లో 5 పోర్లు, 1సిక్స్) జట్టును ఆదుకున్నాడు. పుజారా తన దైన శైలిలో ఓ ఎండ్‌లో పాతుకుపోగా.. గిల్ చూడ చక్కని షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ సోమర్ విల్లే బౌలింగ్‌లో సింగిల్ తీసి టెస్టుల్లో నాలుగో అర్థశతకాన్ని సాధించాడు. లంచ్ విరామానికి భారత్ 82/1తో వెళ్లింది. ఈ సెషన్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
లంచ్ అనంతరం భారత్‌కు గట్టి షాక్ తగిలింది. అర్థశతకంతో మంచి ఊపుమీదున్న గిల్ తొలి ఓవర్‌లోనే జేమీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే (35; 63 బంతుల్లో 6 పోర్లు) పుజారాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. అయితే.. కాసేపటికే పుజారా(22; 88 బంతుల్లో 2 పోర్లు) ను సౌథీ బుట్టలో వేశాడు. దీంతో 106 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మరికాసేపటికే కెప్టెన్ రహానే ను జేమీసన్ బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి టెస్టు ఆడుతున్న అయ్యర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లు మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు.