ఈరోజు సాయంత్రం 7:30 నిమిషాలకు భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ జరగబోతోంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. ఈ మ్యాచ్ పై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా యోగా గురు బాబా రామ్ దేవ్ కూడా ఈ మ్యాచ్ పై వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మ్యాచ్ రాజధర్మానికి విరుద్ధమని అభివర్ణించారు. మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిర్ పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన 'పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితిలో క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజధర్మానికి వ్యతిరేకం. ఇది దేశ ప్రయోజనాల కోసం కాదు. క్రికెట్ ఆట, టెర్రర్ గేమ్‌ని ఒకేసారి ఆడలేం' అని అన్నారు.
ఎల్ఓసీ లో ఉద్రిక్తతల మధ్య ఆదివారం జరిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాల గురించి అడిగినప్పుడు.. రామ్ దేవ్ ఇలా వ్యాఖ్యలు చేశారు. "ఇటువంటి పరిస్థితిలో క్రికెట్ మ్యాచ్ రాజధర్మానికి వ్యతిరేకంగా ఉందని.. దేశ ప్రయోజనాల కోసం ఈ మ్యాచ్ జరగడం లేదని" అన్నారు. క్రికెట్ మ్యాచ్ ఇలాంటి వాతావరణంలో ఆడకూడదని అన్నారు. బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అణ్వాయుధాలు కలిగిన భారత్-పాకిస్తాన్ మూడుసార్లు యుద్ధానికి వెళ్లాయి. కశ్మీర్ విషయంలో వివాదం కొనసాగుతోంది. అందుకే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ప్రపంచ కప్, ఇంకొన్ని టోర్నీలలో మాత్రమే ఇరు దేశాల జట్లు తలపడుతూ ఉన్నాయి. టీ 20 మరియు 50 ఓవర్ల ప్రపంచ కప్‌లలో పాకిస్తాన్‌పై భారత్ 12-0 రికార్డును కలిగి ఉంది.