సమర్పిస్తారా..? సమం చేస్తారా..? దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 నేడే
India looks to Pant in another must win game.తొలి రెండు మ్యాచుల్లో ఓటముల తరువాత అచ్చొచ్చిన విశాఖలో భారత్
By తోట వంశీ కుమార్
తొలి రెండు మ్యాచుల్లో ఓటముల తరువాత అచ్చొచ్చిన విశాఖలో భారత్ అదరగొట్టింది. బ్యాటు, బంతితో రాణించి సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో వెనకబడి ఉన్న భారత్.. నేడు రాజ్‌కోట్ వేదికగా కీలక సమరానికి సిద్దమైంది. గత మ్యాచ్ ప్రదర్శనను పునరావృతం చేసి సిరీస్‌ను సమం చేయాలని భారత్ బావిస్తుండగా.. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది.
సొంతగడ్డపై సీనియర్ల గైర్హాజరీలో యువ భారత్ అదరగొడుతుందని బావించగా.. ఆదిలోనే రెండు షాక్‌లు తగిలాయి. తీవ్ర ఒత్తిడిలో విశాఖలో అడుగుపెట్టిన రిషబ్ పంత్ సారథ్యంలోని యువ భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుందనడంతో ఎలాంటి సందేహాం లేదు. అదే సమయంలో ఉదాసీనతకు తావివ్వకూడదు. ఓపెనర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోవడం కలవరపెడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ పంత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది మేనేజ్‌మెంట్. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ నిలకడ కనబరుస్తుండగా.. గత మ్యాచ్‌లో హర్షల్ పటేల్, చహల్ కూడా గాడిన పడ్డారు. ఇక రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది కనుక మరోసారి భారీ స్కోర్లు నమోదు అవ్వడం ఖాయం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమ్ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. గాయం నుంచి కోలుకున్న డికాక్ తుది జట్టులోకి రావచ్చు. దీంతో రీజా హెండ్రిక్స్‌పై వేటు పడనుంది. గత మ్యాచ్‌లో ఓడినప్పటికి దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల విధ్వంసకర ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. మిల్లర్,క్లాసన్, వాండర్ డసెన్‌లను ఎంత త్వరగా పెవియన్‌కు చేరుస్తారు అన్నదానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.